
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మంచిర్యాల అటవీ ప్రాంత వాసులు భయం గుప్పిట్లో ఇళ్లకే పరిమితమయ్యారు.
ఫారెస్ట్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం ధర్మారావు పేట గ్రామపంచాయతీ పరిధిలోని రొట్టెపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. ఆదివారం (జులై 27) పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ధర్మారావు పేట అటవీ ప్రాంతం రూట్ లో వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మంచిర్యాల జిల్లాలో తరచుగా పులల సంచారం:
మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తూ కనబడింది. కన్నాల పెద్దబుగ్గ ఆలయానికి వెళ్లే రోడ్డు దాటిన పెద్దపులి దట్టమైన అడవిలోకి వెళ్లినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. పెద్దపులి సంచరించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పులి అసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని, అది బీ2 పులి కావచ్చని అభిప్రాయపడ్డారు.
►ALSO READ | రాష్ట్రాన్ని బద్నాం చేయొద్దు..కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినా యూరియా సరఫరా లేదు: మంత్రి తుమ్మల
ఆ తర్వాత రెండు వారాలకు మరోసారి అచ్చలాపూర్ మండలంలోని గోపాలపూర్ అడవుల్లో మరోసారి కనిపించింది పులి. అక్కణ్నుంచి బెల్లంపల్లి మండలం చర్లపల్లి వైపు వెళ్లినట్టు ఫారెస్ట్ అధికారులు పులి ముద్రలను గుర్తించారు.