
- కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల్లో రెండోసారి సీజ్
జన్నారం, వెలుగు : కోర్టు ధిక్కరణ కేసులో మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్‌తో పాటు తాళ్లపేట రేంజ్ ఆఫీస్ ఫర్నిచర్‌ను గురువారం కోర్టు సిబ్బంది జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన దర్శనాల రాజం 1984 నుంచి తాళ్లపేట రేంజ్ పరిధిలో ఎనిమల్ ట్రాకర్‌గా పనిచేస్తుండగా... 1997లో ఫారెస్ట్ ఆఫీసర్లు అతడిని తొలగించారు. దీంతో రాజం గోదావరిఖనిలోని లేబర్ కోర్టును ఆశ్రయించగా రాజంను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు డీఎఫ్‌వోను ఆదేశించింది.
దీంతో 2015లో అతడిని విధుల్లోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు 2016లో మళ్లీ తొలగించారు. రాజం మరోసారి లేబర్ కోర్టును ఆశ్రయించడంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకోవడమే కాకుండా.. రూ.15,89,700 చెల్లించాలని 2017లో లేబర్ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ ఆదేశాలను ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకోలేదు.
దీంతో ఆరు నెలల కింద జన్నారం ఎఫ్‌డీవో ఆఫీస్‌తో పాటు తాళ్లపేట రేంజ్ ఆఫీస్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లు, బ్యాటరీలు, ఇతర వస్తువులను కోర్టు జప్తు చేసింది. అయినా ఆఫీసర్లు స్పందించకపోవడంతో గోదావరిఖని లేబర్ కోర్టు ఆదేశం మేరకు లక్సెట్టిపేట మున్సిఫ్ కోర్టు ఫీల్డ్ ఆఫీసర్లు రజిత్‌కుమార్, ఎండీ.యూసుఫ్, ప్రాసెస్ సర్వర్ సంధ్యారాణి గురువారం ఎఫ్‌డీవో ఆఫీస్‌కు వచ్చి మరోసారి కంప్యూటర్లు, బ్యాటరీలు, బీరువాలు, కుర్చీలను జప్తు చేసి లక్సెట్టిపేట కోర్టుకు తరలించారు.