రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌.. పర్మిషన్​ లేదంటూ జేసీబీల స్వాధీనం

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌.. పర్మిషన్​ లేదంటూ జేసీబీల స్వాధీనం
  • రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌
  •  ఎన్​హెచ్​ –163 విస్తరణ పనులు అడ్డుకున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు
  • పర్మిషన్​ లేదంటూ జేసీబీల స్వాధీనం
  • రెండు శాఖల మధ్య కోఆర్డినేషన్​ లేక నిలిచిన పనులు

ములుగు, వెలుగు :  ఫారెస్ట్​, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హనుమకొండ  జిల్లా కేంద్రం నుంచి ములుగు గట్టమ్మ వరకు నేషనల్​ హైవే – 163 విస్తరణ పనులు జరుగుతుండగా అటవీ మార్గంలో పర్మిషన్​ లేదంటూ ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని పనులు ఎందుకు అడ్డుకున్నారని ఫారెస్ట్​ ఆఫీసర్లను అడిగారు.  దీంతో కంపల్సరీ పర్మిషన్​ తీసుకోవాల్సిందేనని ఫారెస్ట్​ఆఫీసర్లు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ములుగు కలెక్టరేట్ బిల్డింగ్​ నిర్మాణానికి కేటాయించిన భూమిపై కూడా ఫారెస్ట్​ , రెవెన్యూ ఆఫీసర్ల మధ్య గొడవ జరిగింది.

పర్మిషన్​ లేదని ఎన్​హెచ్​ పనుల అడ్డగింత.. 

ములుగు మండలంలోని మల్లంపల్లి నుంచి గట్టమ్మ వరకు జాకారం ఫారెస్ట్​ ఏరియా ఉంది.  సుమారు 7కిలోమీటర్ల వరకు నేషనల్​ హైవే విస్తరణ పనులు చేయాల్సి ఉండగా సోమవారం కాంట్రాక్టర్​ పనులు మొదలు పెట్టారు. దీంతో  మల్లంపల్లి, పందికుంట మధ్యలో జరుగుతున్న పనులకు ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుతగిలారు. రోడ్డుకిరువైపుల ఉన్న చెట్లను తొలగిస్తుండడంతో మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తహసీల్దార్​ సత్యనారాయణ స్వామి ఆదేశాలతో  రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎందుకు పనులు ఆపుతున్నారని వాగ్వివాదానికి దిగారు. రోడ్డుకు ఇరువైపులా రెవెన్యూ భూమి ఉండగా ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. అటవీ శాఖ పర్మిషన్​ లేనిదే పనులు చేయవద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లు తేల్చి చెప్పారు. 

ఈవిషయం కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పి అక్కడి నుంచి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై తహసీల్దార్​ సత్యనారాయణ స్వామిని వివరణ కోరగా ఎన్​హెచ్​ విస్తరణ పనులు అన్ని శాఖల పర్మిషన్​తోనే,  ప్రభుత్వ భూమిలోనే  జరుగుతున్నాయని వెల్లడించారు. సర్వే నెంబర్లు 53/2 నుంచి 53/19 వరకు, 67/2 నుంచి 67/19 వరకు పాత, కొత్త  రికార్డుల్లో, మ్యాప్ లలో సైతం ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని స్పష్టం చేశారు.  అయితే ఫారెస్ట్​, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్​ లేకపోవడంతోనే  అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పర్మిషన్​ తీసుకోవాల్సిందే..

ఫారెస్ట్​ ఏరియాలో పనులు చేపడుతున్న ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు  మా పర్మిషన్​ తప్పక తీసుకోవాలి.  నేషనల్​ హైవే 163 విస్తరణ కోసం ఎలాంటి పర్మిషన్​ తీసుకోకుండా మల్లంపల్లి, జాకారం మధ్య పనులు చేస్తున్నారు. అందుకే మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం.
–ఎన్​.శంకర్​,  ములుగు రేంజ్​ ఆఫీసర్​