కోతమిషన్లతో చెట్ల కూల్చివేత .. పట్టించుకోని ఫారెస్టు ఆఫీసర్లు

కోతమిషన్లతో చెట్ల కూల్చివేత .. పట్టించుకోని ఫారెస్టు ఆఫీసర్లు
  • అక్కడికక్కడే దుంగలుగా మార్చి స్మగ్లింగ్  
  • హైదరాబాద్ కు కలప తరలించుకుపోతున్న స్మగ్లర్లు 

లింగంపేట, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని అడవుల్లో కలప స్మగ్లర్లు ఇష్టారీతిన చెట్లను నరికివేస్తున్నారు.  దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.  ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డి పేట, అటవీ రేంజ్ లో 40 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉండగా..  విలువైన అటవీ సంపద ఉంది. ఈ అడవిలో టేకు, జిట్టేగి, శిరుమాని,మద్ది, ఇప్ప, సెనంగి, తునికి, జీడి,తదితర రకాల చెట్లు విస్తారంగా ఉన్నాయి. 

కొత్త పుంతలు తొక్కుతున్న కలప స్మగ్లింగ్ 

కలప స్మగ్లర్లు కోత మిషన్​ల సాయంతో  గంటల వ్యవధిలోనే వందల సంఖ్యలో టేకు చెట్లను కూల్చివేస్తున్నారు. పెద్ద టేకు చెట్లను సైతం  కూల్చి వాటిని దుంగలుగా మార్చి అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి రేంజ్​ పరిధిలోని మెంగారం, బోనాల్, జల్దిపల్లి, లక్ష్మాపూర్, శెట్పల్లి, అటవీ ప్రాంతాల్లో  చెట్ల కూల్చివేతలు జోరుగా సాగుతున్నాయి. మెంగారం బీట్‌లో ఎల్లారెడ్డి, - కామారెడ్డి ప్రధాన రహదారికి  కిలోమీటర్​ దూరంలో పెద్ద పెద్ద టేకు చెట్లను ఇటీవల కట్టె కోత మిషన్​ల సాయంతో కూల్చివేసి కలప దుంగలను తరలించుకుపోయారు.  

ఎల్లారెడ్డి రేంజ్​ పరిధిలోని  మెంగారం, శెట్పల్లి,  భవానీ పేట, బానాపూర్​, ముంబాజీపేట, కొండాపూర్​, కంచ్​మల్​, మోతె, ముస్తాపూర్​, ​గాంధారి రేంజ్​ పరిధిలోని చద్మల్​, పేట్​సంగెం, సీతాయిపల్లి, గండివేట్​, ముదెల్లి, ఎల్లారెడ్డి రేంజ్​ పరిధిలోని  వెల్లుట్ల, వెంకటాపూర్, అన్నాసాగర్​, అడ్విలింగాల, కొక్కొండ, లక్ష్మాపూర్​, నాగిరెడ్డిపేట రేంజ్​పరిధిలోని లోని బొల్లారం, పోల్కంపేట, రామాయిపల్లి,కోమట్​పల్లి, పోతాయిపల్లి, శెట్పల్లి, ఎక్కపల్లి,పర్మల్ల తదితర ప్రాంతా లలో అడవులు బాగా దట్టంగా ఉన్నాయి. ఎల్లారెడ్డి  రేంజ్​​ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంది.  

రాజకీయ నాయకుల అండదండలు?

ఎల్లారెడ్డి డివిజన్​ పరిధిలోని గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు వ్యక్తులు యంత్రాల సాయంతో  ఫర్నీచర్​ను తయారు చేస్తున్నట్లు సమాచారం. కలప అక్రమ రవాణాకు అలవాటు పడ్డ  కొందరు వ్యక్తులు టేకు కలపతో సోఫాలు, డైనింగ్​ టేబుళ్లు, మంచాలు, కిటికీలు, చౌకోట్లు,తదితర గృహోపయోగ వస్తువులను తయారు చేసి పట్టణ ప్రాంతాలలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

 మార్కెట్ లో టేకు కలపకు భారీ డిమాండ్​ ఉండడంతో పట్ణణ ప్రాంతాలకు చెందిన పలువురు ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు కలప స్మగ్లర్ల నుంచి ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు ఫారెస్టు ఆఫీసర్లను, సిబ్బందిని మచ్చిక చేసుకుని టేకు కలప దుంగల అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొరవడిన నిఘా

అడవుల సంరక్షణ కోసం రాష్ర్ట  ప్రభుత్వం  కోట్లాది రూపాయలను వెచ్చిస్తుండగా అటవీశాఖ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. దీంతో అడవులు అంతరించిపోతున్నాయి. అడవులు, అటవీ భూముల సంరక్షణకు  పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా..  క్షేత్రస్థాయిలో మాత్రం యథేచ్ఛగా చెట్లు నరికివేస్తున్నారు.  ఆయా అటవీ రేంజ్ ల పరిధిలోని అటవీ నుంచి లక్షల విలువ చేసే కలప అక్రమంగా తరలిపోతున్నా.. ఫారెస్టు ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 

2014లో రాష్ర్ట ప్రభుత్వం స్మగ్లర్ల బారి నుంచి అడవులను కాపాడటం కోసం అటవీ శాఖ సిబ్బందికి టూ వీలర్లను ఇచ్చింది. ఉద్యోగం ఉన్న చోటనే ఉండాలనీ ఆదేశాలు జారీ చేసింది. కానీ అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో  ఉండక పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఫారెస్టులో నిఘా కొరవడి అడవుల నరికివేత కంటిన్యూగా సాగుతోంది. ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్​ పరిధిలో  యంత్రాల సహాయంతో కోసిన టేకుదుంగలను కొందరు స్మగ్లర్లు హైదరాబాద్​,సంగారెడ్డి, మేడ్చల్​, మెదక్​,కామారెడ్డి, రామాయంపేట, తదితరపట్టణాలకు తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు  ఉన్నాయి.  

నిఘా పెంచుతాం

ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్​లో  కొనసాగుతున్న టేకు చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్​పై నిఘా పెంచుతాం. ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తాం. చెట్లు నరికివేతకు గురైన బీట్​లను పరిశీలించి సంబంధిత సిబ్బందికి  మెమోలు జారీ చేస్తామని  చెప్పారు.

ఓంకార్​ ఎఫ్​ఆర్​ఓ ఎల్లారెడ్డి