
మంచిర్యాల, వెలుగు: వివిధ అభివృద్ధి పనులకు ఫారెస్ట్ పర్మిషన్లు ఆలస్యం కాకుండా నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రపోజల్స్ పంపాలని పీసీసీఎఫ్, నోడల్ అధికారి మోహన్‌చంద్ర పర్దేయన్ అన్నారు. గురువారం మంచిర్యాల డీఎఫ్‌వో ఆఫీసులో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఎంఐఆర్టీ, పంచాయతీరాజ్ రోడ్లు, ఎల్‌డబ్ల్యుఈ, సింగరేణి సంస్థల సంబంధిత 12 కేసులతో పాటు ఆప్టికల్ ఫైబర్ కేసులకు సంబంధించిన 180 కంటే ఎక్కువ ప్రతిపాదనలను సమీక్షించారు. అటవీ పరిరక్షణ నియమాల్లో చేసిన మార్పులకు అనుగుణంగా ఫస్ట్ ఫేజ్ క్లియరెన్స్ ప్రపోజల్స్ పంపాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కాళేశ్వరం సీసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వోలు లావణ్య, కిష్టాగౌడ్, శివయ్య, ట్రాన్స్ కో ఈఈ రఘునందన్, మంచిర్యాల, చెన్నూర్ ఎఫ్‌డీవోలు సాహు, రమేష్, మిషన్ భగీరథ ఎస్ఈ శేషారావు, సీఈ జ్ఞానకుమార్ పాల్గొన్నారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి డివిజన్ లోని రైస్‌మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీల వేతనాలు పెంచాలని డివిజన్ రైస్ మిల్లు హమాలీ సంఘం అధ్యక్షుడు గెల్లి రాజలింగు యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో హమాలీలు రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. రైసుమిల్లుల యాజమానులు సరైన వేతనాలు చెల్లించడంలేదన్నారు. ప్రతీ రెండు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచాలని కోరినా పట్టించుకోవడంలేదన్నారు. నిరసనలో హమాలీ కార్మిక సంఘం డివిజన్ సెక్రటరీ సింగతి స్వామి, ఉపాధ్యక్షుడు కేసెట్టి సమ్మయ్య, లీడర్లు దర్ని శంకర్, బి.కొమురయ్య, బి.సత్తయ్య పాల్గొన్నారు.
కేసీఆర్ కృషితోనే ఆలయాలు అభివృద్ధి
వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
నిర్మల్,వెలుగు: సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ దైవ భూమిగా మారుతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం నిర్మల్పట్టణంలోని బంగల్ పేట మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మల్ నియోజ కవర్గంలో ప్రతీ ఊరిలో ఆలయాలు నిర్మించామన్నారు. సుమారు రూ. 3 కోట్లతో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. నియోజ కవర్గంలో రూ. 100 కోట్లతో దాదాపు 600 కుపైగా నూతన ఆలయాలు నిర్మించినట్లు వివరించారు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పెంచడానికి ఆలయాలు ఎంతో దోహదపడుతాయన్నారు.
అంగరంగ వైభవంగా ప్రతిష్ఠాపనోత్సవం...
మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ఆధ్వర్యంలో మహాలక్షి అమ్మవారి ప్రతిష్ఠానోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. పట్టణానికి చెందిన వారే కాకుండా మేడిపల్లి, అనంతపేట, నిలాయిపేట, ఎల్లారెడ్డిపేట, ఎల్లపెళ్లి తదితర గ్రామాల కు చెందిన మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్కొరిపెల్లి విజయలక్ష్మి–రామకృష్ణారెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, దేవదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్‌రెడ్డి, అమ్మవారి విగ్రహ దాత లక్కాడి జగన్మోహన్ రెడ్డి, డీఈ ప్రభాకర్, ఏఈ రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు నవీన్, రమాపద్మాకర్, గుంజాల లక్ష్మీచైతన్య, కో ఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్దన్, బంగల్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
ఇంటికి ఫోన్ చేయించి పురుగు మందు అమ్మాలి
మంచిర్యాల, వెలుగు: పురుగుల మందుల కొనుగోలు కోసం వచ్చే వ్యక్తుల వివరాలు తెలుసుకొని, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించిన తర్వాతే మందులు అమ్మాలని డీసీపీ అఖిల్ మహాజన్ ఫెర్టిలైజర్స్ నిర్వాహకులకు సూచించారు. ఆత్మహత్యల నివారణలో భాగంగా గురువారం మంచిర్యాలలోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో ఫెర్టిలైజర్స్ నిర్వాహకులు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయని డీసీపీ అన్నారు. పురుగుల మందు తాగడం వల్ల అవయవాలు దెబ్బతిని తొందరగా చనిపోతారన్నారు. ఈ రకమైన ఆత్మహత్యలను అరికట్టేందుకు ఎవరైనా వ్యక్తులు ఫెర్టిలైజర్ షాప్‌కు వచ్చి పురుగుల మందు కావాలని అడిగితే వారి వివరాలు నమోదు చేసుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించాలన్నారు. వివరాలు చెప్పనివారికి మందులు అమ్మవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు ఇలా చేస్తూ రికార్డ్స్ మెయింటెన్ చేసినట్లయితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
నెట్‌బాల్ పోటీల్లో విద్యార్థికి కాంస్య పతకం
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మోడల్స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.వంశీవర్దన్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలలో కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కర్ణాటకలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం (చిక్క రంగుల) లో జరిగిన జాతీయ స్థాయి నెట్ బాల్ చాంపియన్షిప్పోటీల్లో రాష్ట్ర జుట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం గెలుచుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా వంశీ వర్ధన్ ను ప్రిన్సిపాల్, పీఈటీ బి.తిరుపతి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ప్రేమ్ కుమార్ అభినందించారు.
ఐఆర్సీఎస్ జిల్లా శాఖకు గోల్డ్‌మెడల్స్
మంచిర్యాల, వెలుగు: జనరల్ డొనేషన్ విభాగంలో విశిష్ట సేవలు అందించినందుకు 2019–20 సంవత్సరానికి గాను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖకు రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గోల్డ్‌మెడల్స్ అందజేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ర్టశాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణపతకం అందుకున్నారు. 2021–-22 సంవత్సరానికి బ్లడ్‌బ్యాంక్‌కు అంబులెన్స్ అందించినందుకు సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణరావుకు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ (సీటీసీ) ఎస్కే.సూర్కు, అంబులెన్స్ అందించడానికి కృషి చేసిన కలెక్టర్ భారతి హోళికేరికి స్వర్ణపతకాలు అందజేశారు. అలాగే బ్లడ్‌బ్యాంక్‌కు లక్షల విలువైన మెషిన్లు సమకూర్చినందుకు కలెక్టర్‌కు మరో స్వర్ణపతకం ఇచ్చారు. రూ.కోటితో భవన నిర్మాణం, సామగ్రి దానం చేసినందుకు రామోజీ ఫౌండేషన్ డైరెక్టర్ ఎం.శివరామకృష్ణకు స్వర్ణపతకంతో పాటు స్పెసిఫిక్ డొనేషన్, బ్లడ్ డోనోర్ మోటివేషన్లలో గోల్డ్, సిల్వర్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు
మంచిర్యాల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంచిర్యాల రాజీవ్‌నగర్ నిర్మిస్తున్న ఇండ్ల పనులను గురువారం పరిశీలించారు. లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో 846 ఇండ్లు, మంచిర్యాలలో 650 ఇండ్లు లక్ష్యం కాగా 330 ఇండ్లను జనవరి 15 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, వాటర్ ఇతర పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆర్అండ్బీ ఈఈ రాము, తహసీల్దార్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
సీఎం హామీ నిలబెట్టుకోవాలి
నిర్మల్,వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. పర్వత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సంఘం జిల్లా అధ్యక్షుడు గజేందర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యాశాఖలో నాలుగేళ్లుగా బదిలీలు, ప్రమోషన్లు లేవన్నారు. నిర్మల్‌జిల్లాలో 19 మండలాల గాను కేవలం ఆరుగురు ఇన్చార్జీ ఎంఈవోలు ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,962 హెచ్ఎం పోస్టులు, 7,136 స్కూల్ అసిస్టెంట్, 2,043 పీఎస్ హెచ్ఎం, 8,185 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కేవలం 17 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారన్నారు. 317 జీవో కారణంగా వేలాది మంది టీచర్లు తీవ్రంగా నష్టపోయారన్నారు.ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్ర స్థాయి సంఘం వజ్రోత్సవ వేడుకలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జుట్టు గజేందర్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి నాగ భూషణ్, లీడర్లు బి.గోవింద్ నాయక్ , లక్ష్మణ్, సిరాజొద్దీన్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఇర్ఫాన్ షేక్, అన్సార్ అహ్మద్, పోతన్న, మసూద్, విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఇంతియాజ్ పాల్గొన్నారు.
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
ఇచ్చోడ,వెలుగు: గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం ఇచ్చోడ పీహెచ్ సీని సందర్శించారు. నార్మల్డెలీవరీలు, కేసీఆర్ కిట్లపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాఘోడ్నరేందర్, తహసీల్దార్ మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు. అనంతరం మండలంలోని ఆడేగావ్(బి), ఇస్లాపూర్ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను పరిశీలించారు. మన ఊరు.. మన బడి కింద చేపడుతున్న అభివృద్ధి పనులను తెలుసుకున్నారు. క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎంఈవో ఉదయ్ రావు ఉన్నారు.