గని కార్మికుల సమస్యలపై సీఎంను కలుస్తాం : ఐన్టీయూసీ నేత జనక్ ప్రసాద్

గని కార్మికుల సమస్యలపై సీఎంను కలుస్తాం : ఐన్టీయూసీ నేత జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: గని కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డిని కలిసి పరిష్కారానికి కృషి చేస్తామని ఐన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్​ఎస్​ప్రభుత్వం సింగరేణిని పట్టించుకోలేదన్నారు.కార్మికులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని  బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించడం దారుణమన్నారు. 

గతంలో సింగరేణి సొమ్మును తమ సొంత ప్రాంతాలకు వాడుకున్న నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రైవేట్ బీజం పడిందని, అప్పడు అపడం చేతకాక ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని గుర్తింపు సంఘం ఇప్పుడు తమ అరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

గని కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రులను కలిసి మాట్లాడామని, త్వరలో పరిష్కారమవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, కలవేని శ్యామ్, రవీందర్ రెడ్డి, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.