ట్రాన్స్​పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి: ఆటో, క్యాబ్ యూనియన్ జేఏసీ

ట్రాన్స్​పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి: ఆటో, క్యాబ్ యూనియన్ జేఏసీ
  • ఆర్టీఏ ఆఫీసు ముట్టడించిన ఆటో, క్యాబ్ యూనియన్ జేఏసీ


హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని  లక్షలాది మంది ట్రాన్స్ పోర్ట్ కార్మికుల భద్రతకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో, క్యాబ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. మంగళవారం కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని 7 యూనియన్లతో కూడిన ఆటో యూనియన్ జేఏసీ నేతలు, కార్మికులు ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించాయి. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. మొత్తం 6 డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ వెంకటేశం , సత్తిరెడ్డి, శ్రీకాంత్, సలీంలు డిమాండ్ చేశారు.  

డ్రైవర్ బ్యాడ్జీ రెన్యూవల్ పెనాల్టీ ఎత్తివేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ , నిత్యావసరాల ధరలకు అనుగుణంగా, క్యాబ్ కిలోమీటర్ ధరలను నిర్ణయించాలన్నారు. యాక్సిడెంట్ బీమా రూ.5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని, సాధారణ మరణాలకు, అంగవైకల్యానికి కూడా వర్తింపజేయాలన్నారు. పెంచిన గ్రీన్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ ను తగ్గించటంతో పాటు, క్యాబ్ కు గ్రేటర్ హైదరాబాద్ లో తగినన్ని పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు. బ్యాడ్జీలు కలిగిన డ్రైవర్లకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.