చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామ పరిధిలో ఉన్న బృందావన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ రియాక్టర్ పేలడంతో చెలరేగిన మంటలు మరో రియాక్టర్‌కు అంటుకోవడంతో అది కూడా భారీ శబ్దంతో పేలిపోయింది.
పేలుడు శబ్దాలు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వినిపించడంతో పాటు కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మంటల ధాటికి ఇంకా పేలుళ్లు జరుగుతాయన్న భయంతో ఫైర్ ఇంజిన్లతో సహా ఎవరూ కంపెనీ వద్దకు వెళ్లే ధైర్యం చేయడం లేదు. కాగా, ప్రమాద సమయంలో కంపెనీలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. నైట్ షిఫ్ట్‌లో సాధారణంగా ఐదు నుంచి 10 మంది మాత్రమే ఉంటారని తెలుస్తోంది. ఎంత మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం తెలియడం లేదని యాజమాన్యం చెబుతోంది.
