తెలంగాణ అంతటా అవతరణ సందడి

తెలంగాణ అంతటా అవతరణ సందడి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించారు.

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రగతి నివేదన చేశారు.

తెలంగాణ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

పార్టీ ఆఫీస్ లలోనూ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయి.

తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేశారు కేటీఆర్. జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జాతీయ జెండా ఎగురవేశారు. ఎన్నో కలలతో సాధించుకున్న రాష్ట్రాన్ని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా.. నిరుద్యోగ భృతిపై విధి విధానాలు కూడా రూపొందించలేదని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో ఆ కలలేవీ నిజం కాలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అవతరణ వేడుకల్లో భాగంగా బీజేపీ ఆఫీసులో జెండా అవిష్కరించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ నిరుద్యోగుల ఆశలు నెరవేర్చలేకపోతోందన్నారు.

సకల జనుల తిరుగుబాటు వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన కోదండరామ్… రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్… హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలనేదని మండిపడ్డారు కోదండరామ్.

ముగ్ధూంభవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఐదేండ్ల కాలంలో తెలంగాణను KCR అప్పుల తెలంగాణ గా మార్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఏకం కాకపోతే.. రాష్ట్రం మరింత ప్రమాదంలో పడిపోతుందని చెప్పారు. అసెంబ్లీలో ప్రతి పక్షం లేకుండా చేసినందుకు లోక్ సభ ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పారని అన్నారు నారాయణ.

హైదరాబాద్ జూబ్లీహాల్ లో ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కవులు,రచయితలు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఏర్పాటు, గత ఐదేళ్ల ప్రగతిని పాటలు, కవితల రూపంలో వివరించారు. దేశపతి శ్రీనివాస్, సుద్దాల ఆశోక్ తేజ, గోరేటి వెంకన్న ప్రసంగాలు  ఆకట్టుకున్నాయి.

ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లలో జెండా వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు విద్యార్థులు.