కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృధా.. ఆ డబ్బుతో పేదలందరికీ ఇండ్లు వచ్చేవి: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృధా.. ఆ డబ్బుతో పేదలందరికీ ఇండ్లు వచ్చేవి: మంత్రి వివేక్ వెంకటస్వామి

లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లకే పరిమితమైందని.. అదే లక్ష కోట్లు ఖర్చు చేసి ఉంటే పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చేవని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేవలం కమిషన్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో ఆదివారం (ఆగస్టు 10) ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి పథకాల పురోగతి పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సదర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రోడ్లు డ్రైనేజీలు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పై పంచాయతీ రాజ్, మున్సిపల్, రెవిన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్ అనంతరం మీడియా తో మాట్లాడారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి వివేక్. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన వెంటనే 10 వేల టీచర్స్ పోస్టులు భర్తీచేశామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రూ.200 వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ తీసుకువచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు , కళాశాల్లో మౌళిక సదుపాయాలు బాగున్నాయని ఈ ఆకాడెమిక్ ఇయర్లో 70 శాతం అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. 

తెలంగాణ ప్రజల సొంతింటి కల ఆకాంక్షను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్న వివేక్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు చెన్నూరులో 3 వేల 800 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు. 

చెన్నూరు నియోజక వర్గ ప్రజలకు తాగి నీటి కష్టాలను తీర్చేందుకు రూ.100 కోట్లతో అమృత్ స్కీమ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూరు నియోజక వర్గంలో ఇసుక మాఫియా, భూదందాలకు చెక్ పెట్టినట్లు తెలిపారు మంత్రి వివేక్. 

సింగరేణి సంస్థలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొత్త గనుల టెండర్ లో సింగరేణి సంస్థ పాల్గొనే  లా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.

బీహార్ లో ఒక్కో నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్ గాంధీ మీడియా ముందు ప్రవేశపెట్టారని తెలిపారు. ఎలక్షన్ కు సంబంధించిన ఓటర్ జాబితాను ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే.. డేటా డిలీట్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశంలో ఎన్నికల సరళినీ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో కొనసాగించాలని ఎన్నిల కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే బీజేపీ తప్పు పడుతుందని అన్నారు. ఈవీఎం మిషన్లు ఎన్నికల సమయంలో హ్యాక్ అవుతున్నాయనే అనుమానం ఉందన్నారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా బ్యాలెట్ పద్ధతిని ప్రవేశ పెట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని గుర్తు చేశారు మంత్రి వివేక్.