ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్లకు సూచించారు. ఆదివారం నల్గొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్ వార్డు, మెడికల్ వార్డు, రేడియాలజీ తదితర  విభాగాలను పరిశీలించారు. డాక్టర్లు, నర్సులతో  మాట్లాడి పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 

సీజనల్ వ్యాధులతో ప్రధాన ఆస్పత్రికి వస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉన్నందున నడవలేని పేషెంట్లకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీయిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. మందులు, వైద్య సేవలు, టెస్టులు, ఇతర పరీక్షలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

 అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో అవసరమైన అన్ని వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ సూపరింటెండెంట్​డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్, ఆర్ఎంవో కిరణ్ కుమార్, టీఎస్ఎం ఐడీసీ రాజశేఖర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.