
- గోదావరిలో అసలు వరద జలాలే లేవు
- బనకచర్ల నిర్మాణం అసాధ్యం: వెదిరె శ్రీరామ్
- ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది 1,138 టీఎంసీలే
- అందులోనూ బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకూ వాటా ఉంటది
- ట్రిబ్యునల్ అవార్డు, సీడబ్ల్యూసీ నిబంధనలకు బనకచర్ల విరుద్ధం
- ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే
- ఆ ప్రాజెక్టుతో తెలంగాణతోపాటు బేసిన్‌లోని రాష్ట్రాలకూ నష్టమే
- టీజేయూ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పీపీటీ
హైదరాబాద్, వెలుగు:గోదావరిలో వరద జలాలు అన్నవే లేవని, అసలు ఇప్పటివరకు దేశంలోనే ఆ కాన్సెప్ట్ లేదని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్చెప్పారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని అన్నారు. ట్రిబ్యునళ్లు కేటాయించిన నీళ్లను ఎగువ రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే.. దిగువకు వెళ్తున్నాయని, అంతే తప్ప గోదావరిలో వరదజలాలు లేవని అన్నారు.
సగటు వరద ప్రవాహాలను లెక్కిస్తే 1,138 టీఎంసీల జలాలే అందుబాటులో ఉంటాయని, 3 వేల టీఎంసీలకుపైగా ఉంటాయన్నది నిజం కాదని పేర్కొన్నారు. ఆ 1,138 టీఎంసీల్లో అన్ని రాష్ట్రాలకూ వాటా ఉంటుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజేయూ) ఆధ్వర్యంలో ‘గోదావరి జలాలు, వివాదాలు, వాస్తవాలు’ పేరిట హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో గోదావరి జలాలపై వెదిరె శ్రీరామ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా గోదావరి బేసిన్, సబ్ బేసిన్లవారీగా, ట్రిబ్యునల్ అవార్డులు, రాష్ట్రాలకు చేసిన నికర కేటాయింపులు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు.. గోదావరి బేసిన్ రాష్ట్రాలతోపాటు ఏపీకి గుదిబండగా మారు తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా ఉన్న ట్రిబ్యునల్ అవార్డులతో పోలిస్తే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పూర్తిగా భిన్నమైందని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా చేసుకున్న ఒప్పందాలనే ట్రిబ్యునల్ అవార్డుగా బచావ త్ ట్రిబ్యునల్ కేటాయించిందని తెలిపారు. అందులో భాగంగానే గోదావరిని 12 సబ్ బేసిన్లుగా విభజించారని వివరించారు.
శాస్త్రీయ గుర్తింపే లేదు..
వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం –బనకచర్ల లింక్ ప్రాజెక్ట్.. ట్రిబ్యునల్ అవార్డు, సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్‌కు పూర్తి విరుద్ధమని వెదిరె శ్రీరామ్ తెలిపారు. వరద జలాలకు శాస్త్రీయమైన గుర్తింపే లేదని చెప్పారు. వరద జలాలనే మాట ఊహాజనితమని తెలిపారు. 50 శాతం డిపెండబిలిటీ ఆధారంగా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను కడితే.. దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్నారు.
అలాగే, దిగువ రాష్ట్రాలూ 50 శాతం డిపెండబిలిటీ కింద ప్రాజెక్టులను నిర్మిస్తే.. ఎగువన రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మొత్తం బేసిన్‌లోని రాష్ట్రాలన్నింటికీ నష్టం జరుగుతుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ఏపీ ఆ ప్రాజెక్టు చేపడితే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. ఎస్సారెస్పీ సహా పలు ప్రాజెక్టులు పూడికతో నిండిపోవడం, మరోవైపు కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉండడంతో.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోవడం లేదని అన్నారు.
ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని, నీటి వినియోగానికి ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు. ఆపరేషన్ ప్రొటోకాల్ మార్పులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. కేటాయింపుల మేరకు అన్ని రాష్ట్రాలు తమ నీటివాటాలను వినియోగించుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఆ మిగులు జలాల్లోనూ బేసిన్ రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు.
ఆల్వాటర్స్.. రిమెయినింగ్ వాటర్స్గా విభజన..
గోదావరి సబ్ బేసిన్లలోని ఏదైనా ఒక బేసిన్‌లో ఒక రాష్ట్రమే ఉంటే.. ఆ బేసిన్‌లో ఉండే నీళ్లన్నింటినీ ఆ రాష్ట్రా నికే కేటాయించారని, ఆ జలాలను ఆల్ వాటర్స్గా బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయించిందని వెదిరె శ్రీరామ్ తెలిపారు. అయితే, ఒక బేసిన్‌లో ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలుంటే.. ఆ బేసిన్లలో రాష్ట్రాలు కట్టుకునే ఒక నిర్దిష్ట ప్రాజెక్టుల వరకు ఆల్ వాటర్స్ ఎగువ రాష్ట్రాలకు.. మిగులు జలాలు ఇతర రాష్ట్రాలకు అనేలా రిమెయినింగ్ వాటర్స్ అని పేర్కొన్నారన్నారు.
అందులో భాగంగానే ఏపీకి.. ఎగువన రాష్ట్రాలు వాడుకున్నాక దిగువకు వచ్చే రిమెయినింగ్ వాటర్స్‌ను కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఏ ప్రాజెక్టునైనా 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా చేపట్టాలన్నారు. అంటే నాలుగేండ్లలో కనీసం మూడేం డ్లపాటు కేటాయించాల్సిన మేరకు నీటి లభ్యత ఉండాల ని, దాంతోపాటు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆయకట్టుకు నీళ్లి చ్చే సక్సెస్ రేట్ కూడా ముఖ్యమని చెప్పారు. దాని ప్రకా రం 75 శాతం డిపెండబిలిటీ కింద సర్ప్లస్ వాటర్ (మిగులు జలాలు) లేవని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు.
గోదావరి-కావేరి లింకే బెటర్
బనకచర్ల ప్రాజెక్టుతో పోలిస్తే గోదావరి–కావేరి లింక్ చాలా ఉత్తమమని వెదిరె శ్రీరామ్ తెలిపారు. ఇప్పటికే ఇచ్చంపల్లి వద్ద సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై అధ్యయనం చేసిందని చెప్పారు. అక్కడ జలాల్లేవని తేల్చిందని తెలిపారు. అయితే, ఎగువన చత్తీస్‌గఢ్ వాడుకోకుండా ఉన్న నీళ్లలో 147 టీఎంసీలను తరలించేందుకు కేంద్రం జీసీ లింక్‌ను ప్రతిపాదించిందన్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రమే 90 శాతం నిధులను ఖర్చు చేస్తుందని, మళ్లించే జలాల్లోనూ అత్యధిక వాటా తెలంగాణ, ఏపీకే అందుతాయని వివరించారు. 2 రాష్ట్రాలు కలిసి 147 టీఎంసీల్లో కనీసం 100 టీఎంసీలను వినియోగించుకునే అవకాశముంటుందని వెల్లడించారు. కాగా, పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మీడియాతో వెదిరె శ్రీరాం చిట్‌చాట్ చేశారు.
జీసీ లింక్ ప్రాజెక్టులో మళ్లించనున్న 147 టీఎంసీలకు సంబంధించి చత్తీస్‌గఢ్ గతంలో అంగీకారం తెలిపినా, ప్రస్తుతం విముఖత చూపుతున్నదని తెలిపారు. సొంతంగా పలు ప్రాజెక్టులను చేపడుతున్నదని వివరించారు. ఆ రాష్ట్రాన్ని ఒప్పిస్తామని, ఆ రాష్ట్రం ఒప్పుకుంటే ఆర్థిక ప్యాకేజీని కూడా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు జీసీ లింక్ ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు.
మేడిగడ్డకూ తుమ్మిడిహెట్టి నుంచే రావాలె
తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల జలాలున్నాయని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని వెదిరె శ్రీరామ్ తెలిపారు. మహారాష్ట్ర వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కాకుండానే అక్కడ నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. ఆ 165 టీఎంసీల నీళ్లు కలిపే.. మేడిగడ్డ వద్ద 280 టీఎంసీల నీళ్లుంటాయని కాళేశ్వరం డీపీఆర్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. మేడిగడ్డకూ తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నది నీళ్లు రావాల్సిందేనని అన్నారు.
మరోవైపు ఎత్తుపెంచి ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌తో పని లేకుండా నీటిని అందించవచ్చని, రాయలసీమకు నీళ్లను తరలించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత చెత్త డిజైన్ దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా.. ఆనకట్ట లేకుండా ప్రవహిస్తున్న నదిపైనే మోటార్లను పెట్టి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారన్నారు.
ఆ ప్రాజెక్టులో తగిన స్టోరేజీ కూడా లేదని వివరించారు. స్టోరేజీ కెపాసిటీ లేకపోవడం వల్లే తెలంగాణ గోదావరి జలాల వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నదని, స్టోరేజీల పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
తెలంగాణ పూర్తి వాటా వాడుకోవట్లే..
బేసిన్లలోని రాష్ట్రాలకు ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లను వాడుకోకపోవడం వల్ల దిగువకు వెళ్తు న్నాయని వెదిరె శ్రీరామ్ చెప్పారు. తెలంగాణలో నూ కాళేశ్వరం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టుల కింద 400 టీఎం సీలను వినియోగించుకోలేకపోతున్నదని చెప్పారు. ఇటు చత్తీస్‌గఢ్ కూడా 400 టీఎంసీల జలాలను పూర్తిగా వాడుకోవడం లేదని వెల్లడిం చారు.
75 శాతం డిపెండబిలిటీ కింద గోదావరి లో 3,396.9 టీఎంసీల నీళ్లున్నాయని, అదే సగ టు ప్రవాహాలు (50 శాతం డిపెండబిలిటీ) 4,535.1 టీఎంసీల నీళ్లున్నాయని చెప్పారు. బేసిన్‌లోని రాష్ట్రాలన్నీ నికర కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటే మిగులు జలాలు ఉండబోవని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే స్పష్టం చేశాయన్నారు.
ప్రస్తుతం దిగువకు వెళ్తున్న 1,138.2 టీఎంసీల జలాలు తెలంగాణ, ఏపీకే కాకుండా మిగతా బేసిన్ రాష్ట్రాలకూ చెందుతా యన్నారు. వాటిపై ఏ రాష్ట్రానికీ చట్టబద్ధత ఉండదని వివరించారు.