10 లక్షల ఎకరాలు లెక్కతేలట్లే!.. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య కొనసాగుతున్న భూవివాదాలు

10 లక్షల ఎకరాలు లెక్కతేలట్లే!.. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య కొనసాగుతున్న భూవివాదాలు
  • రాష్ట్రంలో 60.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు 
  • ఇందులో 49 లక్షల ఎకరాలకు క్లియర్ రికార్డ్ 
  • జాయింట్ ​సర్వేకు ముందుకురాని రెవెన్యూ శాఖ
  •  సమస్య పరిష్కారం కోసం ఎక్స్-అఫీషియో ఆఫీసర్లకు బాధ్యతలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో భూముల వివాదాలకు తెరపడటం లేదు. రెండు శాఖలు కలిసి సర్వేలు నిర్వహించి భూముల సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉండగా.. ఇరు శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తప్పు మాది కాదంటే.. మాది కాదని తప్పించుకుంటున్నారు. ఒకవైపు రెవెన్యూ శాఖ చొరవ తీసుకోవడం లేదని అటవీ శాఖ ఆరోపిస్తుండగా..  మరోవైపు అటవీ భూముల సర్వే సరిగా జరగలేదని, ఆయా శాఖలు తమ రికార్డులను వేర్వేరుగా నిర్వహించడం, రికార్డుల నమోదులో స్పష్టత లోపించడం వివాదాలకు కారణమని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 60.64 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

 ఇందులో 49.80 లక్షల ఎకరాలకు క్లియర్​ రికార్డు ఉంది. మిగిలిన పదిన్నర లక్షల ఎకరాల భూమి అటవీ- రెవెన్యూ శాఖల సరిహద్దుల వివాదాలు నెలకొన్నాయి.  వీటిపై ఎలా ముందుకెళ్తే బాగుంటుందనేదానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుండగా.. ఇరుశాఖల మధ్య సమన్వయ లేకపోవడం సమస్యగా మారిందనే విమర్శలున్నాయి. 

ఏ జిల్లాలో ఎంత భూమి..?

కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా.. వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు ఉన్నాయి.  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకు 1.50 లక్షల  ఎకరాలు, నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకు 70 వేల ఎకరాలు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  3.44 లక్షల ఎకరాలకు అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్లు తేలింది.

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 38 వేల ఎకరాలకు 26 వేల ఎకరాలు, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకు 42 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాలు,  నల్గొండ జిల్లాలో 52 వేల ఎకరాలకు 13 వేల ఎకరాల్లో భూ వివాదాలు ఉన్నట్లు లెక్క తేలింది.  

అదనపు కలెక్టర్లకు బాధ్యతలు

అటవీ, రెవెన్యూ రికార్డుల్లో ఆయా శాఖలకు సంబంధించి ఎంత భూములున్నాయనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో అటవీ భూమిని, రెవెన్యూ రికార్డులతో సరిచూసు కుని ఇకపై పకడ్బందీగా స్థిరీకరించుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు తావు ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాదు, ఈ వివాదాల పరిష్కారంలో వేగం పెంచడానికి ప్రభుత్వం జిల్లాల స్థాయిలో అదనపు కలెక్టర్లకు ఎక్స్-అఫీషియో ఫారెస్ట్ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

 ఈ అధికారులు అటవీ భూముల హక్కులు, అభ్యంతరాలను పరిశీలించి, నిర్ణయాలు తీసుకుంటారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అటవీ అధికారులు పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి వివాదాల్లేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-నోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతా మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో మెజారిటీ భూములు రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.