బషీర్‌బాగ్, వెలుగు : లక్డికాపూల్ మెట్రో స్టేషన్‌లో సీనియర్ సిటిజన్‌తో దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్ కుమార్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 21న సాయంత్రం బేగంపేటకు చెందిన న్యాయవాది జి.కృష్ణకిశోర్(62) అమీర్‌పేట్ లో మెట్రో ఎక్కారు. మెట్రోలో సీనియర్ సిటిజన్ కు కేటాయించిన సీట్లలో శివాల సునీల్ కుమార్(32), శివాల రాజేశ్(34), కలిశెట్టి అశోక్(34) కూర్చున్నారు.
వృద్ధుడు గమనించి ఆ సీటు తనకు ఇవ్వాలని కోరాడు. దీంతో ముగ్గురు యువకులు.. వృద్ధుడిపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా లక్డికాపూల్ స్టేషన్ వద్ద ట్రాక్‌పైకి వృద్ధుడిని తోసివేయడంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం బాధితుడు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
