డ్రగ్స్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ పేరు.. దోషిగా తేలితే జీవిత ఖైదు!

డ్రగ్స్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ పేరు.. దోషిగా తేలితే జీవిత ఖైదు!

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ మాక్‌గిల్‌ కిడ్నాప్ కేసు యూటర్న్ తీసుకుంది. రెండేళ్ల క్రితం (2021) కొందరు వ్యక్తులు కారులో వచ్చి తనను అపహరించినట్లు మాక్‌గిల్‌ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రివేళ చీకటి సమయంలో ఆయుధాలు కలిగిన కొందరు వ్యక్తులు తనను కారులో బంధించి తీసుకెళ్లారని.. కాసేపటి అనంతరం తనను కొట్టి బయటకు పడేసేరాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Also Read :- ఆసియా కప్ 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తెలుగు కుర్రాడికి చోటు 

కొన్నాళ్ల అనంతరం ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన నలుగురిలో ఒకరు మాక్‌గిల్ బావ అని తేలడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. 330,000 డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 2 కోట్ల 74 లక్షలు) విలువైన కొకైన్ డీల్‌లో మాజీ స్పిన్నర్ స్టువర్ట్ మాక్‌గిల్ హస్తమున్నట్లు వారు పోలీసుల విచారణలో అంగీకరించారు. 2019లో 1 కిలోల కొకైన్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందంలో గిల్ పాత్ర పోషించినట్లు వెల్లడించారు.

ఈ ఆరోపణలపై గిల్‌ను  రాబరీ అండ్ సీరియస్ క్రైమ్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే డ్రగ్స్ ఆరోణలను ఈ మాజీ క్రికెటర్ ఖండించారు. తాను ఎలాంటి డ్రగ్స్ డీల్‌లో పాల్గొనలేదు అని వెల్లడించారు. ఇంతకు ముందు కూడా గిల్‌ను పోలీసులు విచారించారు. అయితే సరైన సాక్ష్యాధారాలేని కారణంగా అతనిపై ఇప్పటి వరకు అభియోగాలు మోపలేదు. ఒకవేళ ఈ కేసులో అతను దోషిగా తేలితే గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష పడనున్నట్లు అధికారులు తెలిపారు.