అధిష్టానంపై హుజురాబాద్ బీఆర్ఎస్ నేత అసంతృప్తి

అధిష్టానంపై హుజురాబాద్ బీఆర్ఎస్ నేత అసంతృప్తి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి సొంత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీరును వివరిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేఖ రాశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీలో నెలకొన్న విభేదాలపై ఆ లేఖలో వివరించారు. 

రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి గొప్ప పథకాలకు హుజురాబాద్ నియోజకవర్గం వేదికగా నిలిచిందని, అలాంటి ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ చార్జ్ గా ఉన్న ఎమ్మె్ల్సీ పాడి కౌశిక్ రెడ్డి విఫలమయ్యారంటూ ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులు కేసీఆర్ కు చేరకుండా కౌశిక్ రెడ్డి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారంటూ పేర్కొన్నారు. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ.. ఇక్కడి నాయకులకు గొప్ప పదవులు ఇచ్చారని, అయితే... ఇక్కడ ఆశించిన రీతిలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టడపడుతున్న వారిని పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అధిష్టానానికి చేరకుండా.. ఇక్కడ డివిజన్ అధికారులను మార్చి.. తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకుని.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రిపోర్టు పంపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను చెప్పకుండా దాచి పెడుతున్నారని చెప్పారు. కౌశిక్ రెడ్డి తీరు కారణంగా బీఆర్ఎస్ పార్టీపై నియోజకవర్గం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నాయకులు వర్గాలుగా ఏర్పడి.. ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుత ఇన్ చార్జ్ గురించి సమగ్ర నివేదిక తెప్పించుకుని.. విచారణ జరిపి.. కౌశిక్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని తుమ్మేటి సమ్మిరెడ్డి లేఖలో కోరారు.