ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితాలే రిపీట్

ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితాలే రిపీట్

చేవేళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  బీజేపీ గూటికి చేరబోతున్నారు. త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.  గత రెండేళ్లుగా తెలంగాణ కోసం ఏది మంచిదైతే బాగుటుందని వివిధ రాజకీయ వ్యక్తులతో చర్చించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోతేనే తెలంగాణ బాగుపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసే శక్తి  బీజేపీకే ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ను ఓడించే సత్తా కాంగ్రెస్కు లేదన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన..ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిందని..త్వరలో ఇతర రాష్ట్రాల్లోని  ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు. 

అటు బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగానే కాదు..ప్రధాని మోడీకి  ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఎవరిని అడిగినా మళ్లీ మోడీయే ప్రధాని అవుతారని చెప్తారన్నారు. కాబట్టి..వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

తాను పొలిటికల్ కెరియర్ కోసం రాజకీయాల్లోకి రాలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.  తెలంగాణ అభివృద్ది... రంగారెడ్డి జిల్లా అభివృద్ది..అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కావాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్దిపై రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు,  ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు.  అటు టీఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లా అన్యాయానికి గురైందన్నారు. ఈ జిల్లా నిధులను ఇతర వాటికి మళ్లించారని ఆరోపించారు. 

ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉద్యమకారులేవరు లేరని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుల వల్ల కుర్చీ ఎక్కి..ఇవాళ వారిని మరిచారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారని చెప్పారు. తెలంగాణను కోరుకున్న వారు టీఆర్ఎస్లో లేరన్నారు. 

 రాష్ట్రంలో కేసీఆర్పై వ్యతిరేకత పెరిగిపోతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం  కేసీఆర్కు వ్యతిరేకంగా 75 శాతం మంది జనం ఉన్నారని చెప్పారు.  హుజరాబాద్లో అలాగే జరిగిందని... అక్కడ వందల కోట్లు ఖర్చు చేసినా..ఈటెల గెలిచారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో యాంటీ కేసీఆర్ ఓట్లు బీజేపీకే పడతాయన్నారు.  కాంగ్రెస్కు అంత శక్తి లేదన్నారు. 

 బీజేపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఒక్కడినే బీజేపీ కండువా కప్పుకోబోతున్నాన్నారు. వివిధ జిల్లాల్లోని పలువురు నేతలు కూడా తనతో చేరుతామని చెబుతున్నారన్నారు. అయితే తాను బీజేపీలో ఎప్పుడు చేరేది..ఎక్కడ చేరేది ఎవరి ఆధ్వర్యంలో చేరేది అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకుంటారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే చేరే అవకాశం ఉందన్నారు. తాను ఏ పదవి ఆశించి చేరడం లేదన్నారు.  టికెట్ డిమాండ్ చేయలేదని చెప్పారు.