కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులు యువతను పట్టించుకోలే : రాహుల్ గాంధీ

కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులు యువతను పట్టించుకోలే : రాహుల్ గాంధీ
  • ప్రజా సమస్యలను మీడియా కూడా చూపట్లే 

జైపూర్:  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, యువకులు, మహిళలను పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గురువారం రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) అడుగుతున్నారు. యువకులు ఉపాధి కోసం చూస్తున్నారు. మహిళలు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నారు. కానీ, వారి మాటలను ఎవరూ పట్టించుకోవట్లేదు. వచ్చే లోక్ సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి. 

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశంలోని రెండు అతిపెద్ద సమస్యలు. కానీ, మీరు మీడియాను ఫాలో అయితే అంబానీ కొడుకు పెళ్లికి అధిక ప్రాధాన్యం లభిస్తుంది. మీడియాలో 24 గంటల పాటు మోదీ ముఖమే కనిపిస్తుంది. ప్రజల సమస్యలను గొంతెత్తి చాటడమే మీడియా పని. కానీ, వాటిపై మీడియా మాట్లాడదు. ఎందుకంటే మీడియాను 15 నుంచి 20 మంది నియంత్రిస్తున్నారు”అని రాహుల్ గాంధీ  మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతుందని, రైతులకు ఎంఎస్పీ అమలు చేస్తుందన్నారు.  ఈ ఎన్నికలు దేశంలోని పేదలకు 22 నుంచి 25 మంది బిలియనీర్లకు మధ్య పోరాటమన్నారు.