బీజేపీ కరప్షన్ స్కూల్ నడుపుతుంది: రాహుల్ గాంధీ

బీజేపీ కరప్షన్ స్కూల్ నడుపుతుంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన బీజేపీ నేతలకు అవినీతి పాఠాలు బోధిస్తున్నారని అన్నారు. ‘‘మోదీ అవినీతి పాఠశాలను నడుపుతున్నారు. అక్కడ ‘కరప్షన్ సైన్స్’ సబ్జెక్టును బోధిస్తున్నారు. ఇందులో భాగంగా రెయిడ్స్ నిర్వహించి డొనేషన్స్ ఎలా సేకరించాలి? డొనేషన్స్ తీసుకున్న తర్వాత కాంట్రాక్టులను ఎలా కేటాయించాలి? అవినీతి మరకలను వాషింగ్ మెషిన్ ఎలా కడిగేస్తుంది? ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్ అండ్ జైల్’ గేమ్ ఎలా ఆడాలి? అనే అంశాలను వివరిస్తున్నారు” అని పేర్కొన్నారు. 

అవినీతికి బీజేపీ డెన్ లాగా మారిందని, ఈ క్రాష్ కోర్సును ఆ పార్టీ నేతలందరికీ తప్పనిసరి చేసిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ అవినీతి పాఠశాలను మూసేస్తామని, ఈ కోర్సును పూర్తిగా బంజేస్తామని చెప్పారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ అవినీతికి పాల్పడిందని పేర్కొంటూ ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. కాగా, ఇదే వీడియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర.. 

ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని, ధనవంతులకే కొమ్ముకాస్తున్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నలుగురైదుగురు బిలియనీర్లకే మద్దతు ఇస్తున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నది. అదే జరిగితే రాజ్యాంగం పుణ్యమా అని పేదలు, దళితులు, గిరిజనులకు అందిన ఫలాలన్నీ పోతాయి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు పోరాడుదాం. ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుదాం” అని పిలుపునిచ్చారు. శనివారం బీహార్ లోని భగల్ పూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొని మాట్లాడారు.

 ‘‘మన దేశంలో 70 కోట్ల మంది దగ్గరున్న సంపదకు సమానమైన సంపద 22 మంది ధనవంతుల దగ్గరే ఉంది. దేశంలో 70 కోట్ల మంది రోజుకు రూ.100 కంటే తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీస్తున్నారు. ప్రధాని మోదీ 25 మంది ధనవంతుల లోన్లను మాఫీ చేశారు. ఆ లోన్ల విలువ రూ.16 లక్షల కోట్లు. ఇది మేం అధికారంలో ఉన్నప్పుడు రైతుల లోన్లను మాఫీ చేసిన దానికి 25 రెట్లు ఎక్కువ. అలాగే ఉపాధి హామీ పథకం 25 ఏండ్ల బడ్జెట్ కు సమానం” అని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తే పేదలందరికీ సమానంగా సంపదను పంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, దానికి తమ దగ్గర పరిష్కారం ఉన్నదని చెప్పారు.

కర్నాటకపై ఎందుకీ పక్షపాతం?: జైరాం రమేశ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కర్నాటకపై పక్షపాతం చూపిస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. చిక్కబళ్లాపూర్ లో ప్రధాని మోదీ ర్యాలీ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన కరువు నిధులు రూ.18 వేల కోట్లు ఎందుకు విడుదల చేయడం లేదు? ఉపాధి కూలీలకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు? వస్తున్న రెవెన్యూలో కర్నాటకకు సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదు?” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు.