- సీపీఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు దయానంద్ రెడ్డి
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు: ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని చెప్పి మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు దయానంద్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకకు అధికారులు అనుమతి ఇవ్వాలని శుక్రవారం తహసీల్దార్ ఆఫీసు ముందు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నిర్మలకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తీగుల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలని లేదంటే లబ్ధిదారుల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, ఐలయ్య, ఎల్లారెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.
