- రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం.. మైనారిటీ కోటాలో అవకాశం
- 16కు చేరనున్న మంత్రుల సంఖ్య సీఎం రేవంత్‌కు
- అజారుద్దీన్, మైనార్టీ నేతల కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్లో బెర్త్ ఖరారైంది. శుక్ర వారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత ఇది కేబినెట్ రెండో విస్తరణ. మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. అజారుద్దీన్ వరకే తాజా విస్తరణను పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం సీఎం సహా రాష్ట్ర కేబినెట్లో మొత్తం 15 మంది ఉన్నారు. అజారుద్దీన్ రాకతో మంత్రుల సంఖ్య 16 కు చేరనుంది. కేబినెట్లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా.. మరో రెండు మంత్రి పదవులు పెండింగ్ లో ఉంటాయి. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యే అవకాశం దక్కబోతున్నది.
ఇప్పటికే ఎమ్మెల్సీగా కేబినెట్ ఓకే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని అజారుద్దీన్ ప్రయత్నిస్తుండగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పెండింగ్ లో ఉన్నప్పటికీ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించడంతో మంత్రివర్గ విస్తరణకు, ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకుంటే అటు మైనార్టీ కోటాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కోటా కూడా భర్తీ చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
క్రికెటర్ నుంచి పొలిటీషియన్‌గా..
62 ఏండ్ల అజారుద్దీన్ మాజీ క్రికెటర్ గా, టీమిండియా మాజీ కెప్టెన్ గా సుపరిచితులు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. 2009 లో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లో రాజస్థాన్ నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసినా అదృష్టం వరించలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అజారుద్దీన్ పనిచేశారు. తాజాగా కేబినెట్లో బెర్త్ ఖరారవడంతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని అజారుద్దీన్ తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
