సీఎం రేవంత్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్.. మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్.. మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతోన్న మాజీ క్రికెటర్‎ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమురూ నాగరాజు అనే వ్యక్తి క్రికెటర్. గతంలో ఇతడు రంజీ మ్యాచులు కూడా ఆడినట్లు సమాచారం. ఏమైందో తెలియదు గానీ నాగరాజు పక్క దారి పట్టాడు. క్రికెట్‎కు వీడ్కోలు పలికిన అడ్డదారుల్లో సంపాదించడంపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నకిలీ అవతారం ఎత్తాడు.

తాను సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీని అంటూ ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మెన్‎లకు తాను రేవంత్ రెడ్డి ఓఎస్డీని అంటూ వాట్సాప్‎లో మెసేజ్‎లు పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అంటూ ఓ ఫేక్ ఈ మెయిలే క్రియేట్ చేశాడు. నాగరాజు సీఎం రేవంత్ రెడ్డి పేరుతో పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ నోటా ఈ నోటా సమాచారం పోలీసులకు చేరింది. 

ఇంకేముంది సీఎం పేరుతోనే వసూళ్లకు పాల్పడుతున్న నాగరాజు ఆట కట్టించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే గురువారం (మే 22) శ్రీకాకుళంలో చాకచక్యంగా నాగరాజును అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అనంతరం అక్కడి పోలీసులకు సమాచారం అందించి.. నాగరాజును హైదరాబాద్‎కు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30కి పైగా ఉన్నట్లు గుర్తించి పోలీసులు ఖంగుతిన్నారు.