కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం ఇప్పించండి

కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం ఇప్పించండి

సచిన్తో పోటీపడి ఆడిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇప్పుడు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. తొలి ఏడు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలతో సంచలన ఇన్నింగ్స్లు ఆడిన కాంబ్లీ....కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం ఇప్పించమని వేడుకుంటున్నాడు.  

పింఛన్ మీదే బతుకుతున్నా..
ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అన్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే రూ. 30వేల మీదే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నానని చెప్పాడు. తనకు పింఛన్ ఇస్తున్న బీసీసీఐకి కాంబ్లీ థాంక్స్ చెప్పాడు. ఈ పింఛన్ సరిపోవడం లేదని..కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నాడు. తనకు క్రికెట్ కు సంబంధించిన పని ఏదైనా ఇస్తే..చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంబ్లీ తెలిపాడు. 

ఎంసీఏలో ఉద్యోగం ఇస్తే..
తాను యువ క్రికెటర్లతో పనిచేయాలనుకుంటున్నట్లు కాంబ్లీ చెప్పాడు. అందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సాయం చేయాల్సిందిగా కోరుతున్నానన్నాడు. యువకులకు తన అనుభవం ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డాడు. దీనితో పాటు..తనకు ఆదాయం వస్తుందని..తద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవచ్చన్నాడు. ఇప్పటికే ఎంసీఏ తనకు క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలో చోటు ఇచ్చిందని..అయితే ఇందుకు జీతం ఏమీ ఇవ్వరన్నాడు. ముంబై క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని..అందుకు ఎంసీఏకు రుణపడి ఉంటానని కాంబ్లీ చెప్పుకొచ్చాడు. 

సచిన్కు నా సమస్యలు తెలుసు..


తన ఆర్థిక పరిస్థితి గురించి సచిన్కు తెలుసని కాంబ్లీ చెప్పాడు. అతన్ని అడిగితే తనకు సాయం చేస్తాడని..కానీ అడగాలని అనుకోవడం లేదన్నాడు. ఇప్పటికే తనకు సచిన్ ఎంతో చేశాడని చెప్పుకొచ్చాడు.  సచిన్ ఇప్పటికే తన అకాడమీలో అవకాశం ఇచ్చాడని... అందులో ఆదాయం వచ్చేదన్నాడు. అందులో యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేశానని...అయితే టెండూల్కర్ అకాడమీ కోసం నెరుల్ వెళ్లడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో తాను శారీరకంగా అలసిపోయేవాడినంటూ పేర్కొన్నాడు. అందుకే అక్కడ మానేశానన్నాడు.  సచిన్ నాకు  మంచి స్నేహితుడని... అతను ఎప్పుడూ తనకు అండగా ఉంటాడ కాంబ్లీ చెప్పుకొచ్చాడు.

కాంబ్లీ కెరీర్..
కాంబ్లీ  టీమిండియా తరఫున 17 టెస్ట్‌లు, 104 వన్డేలు ఆడాడు. మొత్తం 3,500కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు చేశాడు. కాంబ్లీ ఖాతాలో 4 టెస్ట్‌ సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రం చేసిన కొద్దిరోజుల్లోనే వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు కొట్టి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఆడంబరమైన జీవనశైలికి అలవాటు పడి జట్టులో చోటు కోల్పోయేవాడు. మొత్తం తొమ్మిదిసార్లు జట్టులో పునరాగమనాలు చేసినా కూడా..ఫాంను అందుకోలేక..టీమిండియాకు శాశ్వతంగా దూరమయ్యాడు.