భువనగిరి కాంగ్రెస్‌లో..ఆగని విభేదాలు!

భువనగిరి కాంగ్రెస్‌లో..ఆగని విభేదాలు!
  •      కుంభం మీటింగ్‌కు జిట్టా సహా పలువురు నేతల గైర్హాజర్
  •     తన కోసం కోమటిరెడ్డి ప్రచారం చేస్తారంటున్న కుంభం
  •     బీసీకి టికెట్​ఇవ్వకుంటే తనకే ఇవ్వాలని జిట్టా డిమాండ్
  •     త్వరలో బీసీ విజయభేరి సభ నిర్వహిస్తామని ప్రకటన

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా   లీడర్ల మధ్య విభేదాలు కొలిక్కి రావడం లేదు. శుక్రవారం ఎవరికి వారు పోటాపోటీగా మీటింగ్‌లు నిర్వహించారు.  పోచంపల్లిలో నిర్వహించిన గ్యారంటీ స్కీమ్​సభలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి టికెట్‌ తనకేనని ప్రకటించగా.. బీబీనగర్​లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో టికెట్​ఇస్తే బీసీకే ఇవ్వాలని, లేకుంటే తనకే ఇవ్వాలని జిట్టా బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. 

కుంభం మీటింగ్‌కు హాజరు కాని జిట్టా

భూదాన్​ పోచంపల్లిలో శుక్రవారం ఆరు గ్యారంటీ స్కీమ్స్​పై డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్‌ ఏర్పాటు చేశారు.  అంతకుముందు జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించి, ప్రజలకు ఆరు గ్యారంటీ స్కీమ్స్​వల్ల కలిగే లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా తనకు టికెట్​వస్తుందని, ఎంపీ కోమటిరెడ్డి ప్రచారం చేస్తారని కుంభం ప్రకటించారు. కాగా, ఈ మీటింగ్‌కు టికెట్‌ ఆశిస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి, పోత్నక్​ ప్రమోద్​కుమార్, రామాంజనేయులు గౌడ్​గైర్హాజర్​అయ్యారు.  

బీసీలకు టికెట్ ఇవ్వాలని మీటింగ్

కుంభం మీటింగ్‌ వెళ్లేందుకు రెడీ అయిన పలువురిని జిట్టా బాలకృష్ణారెడ్డి, రామాంజనేయులు నిలువరించడంతో పాటు బీసీలకే టికెట్​ ఇవ్వాలన్న డిమాండ్​తో బీబీనగర్​లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిట్టా మాట్లాడుతూ భువనగిరి అసెంబ్లీకి కాంగ్రెస్​ తరఫున బీసీ అభ్యర్థికి టికెట్​ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీసీలకు ఇవ్వలేని పక్షంలో తనకే ఇవ్వాలని కోరారు. పార్టీలో కొందరు ఒంటెద్దు పోకడలు పోతున్నారని,  అలాంటి వారిని ప్రోత్సహించవద్దని హైకమాండ్‌కు సూచించారు.   టికెట్​బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్​తో  భువనగిరిలో  ఆదివారం ‘బీసీ విజయభేరి’ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే మంగళవారం వలిగొండలో ఆరు గ్యారంటీ స్కీమ్స్​పై కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.

జిట్టా వర్సెస్ కుంభం

ఎంపీ వెంకటరెడ్డిని వ్యతిరేకిస్తూ కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి బీఆర్​ఎస్​లో చేరడం, ఈ సమయంలో చేరితే టికెట్ ​గ్యారంటీ అన్న నమ్మకంతో జిట్టా బాలకృష్ణారెడ్డి  కాంగ్రెస్​లో చేరిన సంగతి తెలిసిందే. తర్వాత కుంభం అనిల్​రెడ్డి తిరిగి కాంగ్రెస్​లో చేరడంతో వారి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. టికెట్​ హామీతోనే తిరిగి వచ్చిన కుంభం నియోజకవర్గంలో రెగ్యులర్​గా పర్యటనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు జిట్టా సహా బీసీ లీడర్లు పోత్నక్​ ప్రమోద్​కుమార్​, పంజాల రామాంజనేయులు, పచ్చిమట్ల శివరాజ్​ గౌడ్​ దూరంగా ఉంటున్నారు.  సపరేట్‌గా సమావేశాలు నిర్వహించి కుంభంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణరెడ్డి రంగంలోకి దిగి గురువారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి టికెట్​ ఎవరికి వచ్చినా  గెలుపు కోసం పని చేయాలని సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.