హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ మృతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ (87) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో  తుదిశ్వాస విడిచారు. వీరభద్ర సింగ్‌ ఏప్రిల్‌ 13న కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన మోహాలీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఏప్రిల్ 30న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. 

వీరభద్ర సింగ్ 1934 జూన్‌ 23న రాజ కుటుంబంలో పుట్టారు. అందుకే ఆయనను రాజా సాహిబ్‌ అని పిలుస్తారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్‌ తరపున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆయన ఆరుసార్లు సీఎంగా సేవలందించారు. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ గతంలో మండి నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాధిత్య సింగ్ ప్రస్తుతం సిమ్లా ఎమ్మెల్యేగా ఉన్నారు.