ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్ 10 కోట్లు అడిగిండు: శివబాలకృష్ణ

ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్ 10 కోట్లు అడిగిండు: శివబాలకృష్ణ
  • ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివ బాలకృష్ణ వెల్లడి
  • 12 ఎకరాల ల్యాండ్ సెటిల్‌ చేసి రూ.10 కోట్లు ఇవ్వాలని అన్నడు
  • బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని
  • తన ల్యాండ్​కు రోడ్డు వేయాలని సోమేశ్ ప్రెజర్​ చేసినట్లు వాంగ్మూలం

హైదరాబాద్‌, వెలుగు: హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్‌‌ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ చుట్టూ ఉచ్చుబిగుస్తున్నది. వివిధ రియల్ ఎస్టేట్‌ కంపెనీలు, ల్యాండ్​సెటిల్​మెంట్లలో అరవింద్‌కుమార్‌ పాత్ర ఉన్నట్లు శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించాడు. ఆయన చెప్పిన విధంగానే తాను వ్యవహరించినట్లు తన కన్‌ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో వివరించాడు. తన అక్రమాస్తుల కేసులో అరవింద్‌ కుమార్‌ పాత్రను ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. దాదాపు13 పేజీలకు పైగా ఉన్న శివబాలకృష్ణ స్టేట్‌మెంట్​ను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు.

సంబంధిత అధికారులను విచారించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

శివబాలకృష్ణ కన్‌‌ఫెషన్​లో అంశాలు.. 
-
నార్సింగిలోని 12 ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మల్టీస్టోర్‌‌‌‌ బిల్డింగ్‌‌ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో చట్టపరమైన సమస్యల కారణంగా పెండింగ్‌‌లో ఉంది. అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో నిరుడు నవంబర్, డిసెంబర్‌‌‌‌లో హెచ్‌‌ఎండీఏ సెక్రటరీ చంద్రయ్య దాన్ని సెటిల్​చేశారు. ప్లాన్​కు పర్మిషన్​ఇచ్చారు. ఈ వ్యవహారంలో అరవింద్ కుమార్ ఆ సంస్థ యాజమాన్యం నుంచి  రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించారు. ఇందులో రూ.1 కోటి నగదును సంస్థ ప్రతినిధి ఒకరు డిసెంబర్‌‌‌‌లో ఇచ్చాడని చెప్పాడు. ఆ డబ్బును మరుసటి రోజు ఉదయం జూబ్లీహిల్స్‌‌ అంబేద్కర్‌‌ ఓపెన్‌‌ యూనివర్సిటీ సమీపంలోని అరవింద్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి అందించినట్లు పేర్కొన్నాడు.

డ్రైవర్లు, గన్‌‌మెన్ల పేర్లతో ప్లాట్ల రిజిస్ట్రేషన్

ఒక ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్, ప్రైమ్‌‌ ల్యాండ్‌‌ ప్రాపర్టీస్​కు చెందిన కీలక వ్యక్తి కంది మండలం, ఇతర ప్రాంతాల్లో వేసిన వెంచర్స్‌‌లో కొన్ని ప్లాట్లు తమకు బహుమతిగా ఇచ్చారని శివబాలకృష్ణ వివరించాడు. అరవింద్‌‌ కుమార్‌‌ తన డ్రైవర్లు, గన్‌‌మెన్లు, ఇతరుల పేర్లపై ప్లాట్లు రిజిస్టర్‌‌ చేయించేవాడని తెలిపాడు. వాట్సాప్‌‌ ద్వారా మాత్రమే వివరాలు పంపేవాడని శివబాలకృష్ణ పేర్కొన్నాడు. ఎవరి పేరు మీద ప్లాట్లు రిజిస్టర్‌‌ చేయాలన్నది సూచించేవాడని అవే వివరాలను తను డెవలపర్స్‌‌కు పంపేవాడిని వెల్లడించాడు. అలాగే తనకు గిఫ్ట్‌‌గా వచ్చిన ప్లాట్లను తన మేనల్లుడు భరణి పేరిట రిజిస్టర్‌‌ చేయించానని పేర్కొన్నాడు. 2022 ఆగస్టు, డిసెంబర్‌‌ నెలల్లో రిజిస్ట్రేషన్‌‌ చేయించానని తెలిపాడు. రిజిస్ట్రేషన్‌‌ ఫీజులను కూడా ఆయా కంపెనీలే చెల్లించేవని చెప్పాడు.

అరవింద్‌‌ కుమార్‌‌కు బినామీలు!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్‌‌లోని -ఓ వెంచర్‌‌లో అరవింద్‌‌ కుమార్‌‌కు 550 చదరపు గజాల ఓపెన్‌‌ ప్లాట్‌‌ ఉన్నట్లు శివబాలకృష్ణ తెలిపాడు. అరవింద్‌‌ కుమార్‌‌‌‌ చెప్పిన వారికి డబ్బులు చేరవేసేవాడినని స్టేట్‌‌మెంట్‌‌లో వివరించాడు. మైహోం బూజాలో నివాసం ఉండే ఒక వ్యక్తికి, మరో ప్రాజెక్ట్​కు చెందిన వ్యక్తికి, కిస్మత్‌‌పురలో నివాసం ఉండే వ్యక్తికి, ఎల్బీనగర్‌‌కు చెందిన వ్యక్తి, అతని అనుచరుడికి రూ.5 కోట్లు అందించినట్లు తెలిపాడు. వీరంతా అరవింద్‌‌ కుమార్‌‌‌‌కు బినామీలా లేక ఇతర కారణాలతో వారికి ఇవ్వమన్నాడా అనేదాని క్లారిటీ లేదని చెప్పినట్లు తెలిసింది.

సకుటుంబ సమేతంగా అక్రమార్జన

టౌన్‌‌ ప్లానింగ్‌‌లో భారీగా అక్రమార్జనకు అవకాశం ఉండడంతో శివబాలకృష్ణ తన కుటుంబ సభ్యులు పలువురిని హెచ్‌‌ఎమ్‌‌డీఏలో చేర్పించాడు. సోదరుడు శివ నవీన్‌‌ కుమార్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ చేస్తుండేవాడు. దీంతో అతన్ని తన ఆర్థిక లావాదేవీలు చూసుకునే విధంగా నియమించాడు. మేనల్లుళ్లు భరత్‌‌ కుమార్‌‌‌‌, భరణి కుమార్‌‌, శ్రీకుమార్‌‌‌‌లను తనకు అవసరమైన ప్రాంతాల్లో నియమించాడు. భరణి కుమార్‌‌కు హెచ్‌‌ఎమ్‌‌డీఏ డైరెక్టర్‌‌(ప్లానింగ్‌‌1)‌‌ ఆఫీస్‌‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌గా ఉద్యోగం ఇప్పించాడు. అతను శివబాలకృష్ణ పీఏగా వ్యవహరించేవాడు. అతని ఛాంబర్‌‌‌‌ నుంచే విధులు నిర్వహించేవాడు. మరో మేనల్లుడు శ్రీకుమార్‌‌‌‌ను మాదాపూర్‌‌‌‌లోని ఒక పెద్ద రియల్ ఎస్టేట్, కన్​స్ట్రక్షన్ సంస్థలో ఇంజనీర్‌‌‌‌గా పెట్టాడు. 

హెచ్‌‌ఎండీఏలో మేనల్లుళ్ల హవా

పెంట భరత్‌‌ కుమార్‌‌‌‌ ఇంటీరియర్‌‌‌‌ డిజైన్స్‌‌, ప్రాజెక్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కన్సల్టెన్సీ నిర్వహించేవాడు. భరత్‌‌ కుమార్‌‌‌‌ క్లయింట్స్‌‌ అయిన బిల్డర్లు, రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులకు లే అవుట్‌‌, బిల్డింగ్ కన్‌‌స్ట్రక్షన్‌‌కు సంబంధించిన అన్ని పర్మిషన్లను వేగంగా పూర్తి చేసేవాడు. బాలకృష్ణ బావ సింగరాజు ప్రమోద్‌‌ కుమార్‌‌‌‌ను ఒక కన్‌‌స్ట్రక్షన్స్‌‌ సంస్థలో మేనేజర్‌‌‌‌గా నియమించాడు. తనకున్న పలుకుబడితో చాలా పెద్ద మొత్తంలో జీతం ఇప్పించాడు. సింగరాజు ఆ సంస్థకు పర్మిషన్లు ఇప్పించడం లాంటి పనులను చేసి పెడుతుండేవాడు. ముగ్గురు మేనల్లుళ్లు ఇల్లీగల్‌‌ పర్మిషన్స్‌‌, హెచ్​ఎండీఏలో తమకు కావల్సిన ఇతర పనులను నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకునేవారు. లబ్ధి పొందిన రియల్టర్స్, బిల్డర్స్‌‌ నుంచి ఆయా ప్రాజెక్ట్‌‌లకు సంబంధించిన మొత్తం విలువ ఆధారంగా లంచం తీసుకునేవారు.  ఆర్థిక లావాదేవీలు అన్నీ నవీన్‌‌ కుమార్‌‌ నిర్వహించే వాడు. అలాగే కుటుంబ సభ్యులు అందరినీ తన బినామీలుగా చేసుకున్నాడు.

లంచం డబ్బులు ఇంటికే తీసుకెళ్లి ఇచ్చేవాడిని

ఏడు నెలల క్రితం బాచుపల్లిలో రెండు ఎకరాలలోపు ల్యాండ్‌‌ కన్వర్షన్‌‌ చేసినందుకు లంచం తీసుకున్నట్లు శివబాలకృష్ణ తెలిపాడు. దీనికి సంబంధించిన ఒక వ్యక్తి తనను రెరా ఆఫీసులో కలిసి అక్కడే రూ.కోటి ఇచ్చాడని చెప్పాడు. ఈస్ట్‌‌ మారేడ్‌‌పల్లిలోని ఒక కంపెనీకి చెందిన ప్రాజెక్ట్‌‌ విషయంలో జీహెచ్‌‌ఎంసీ అనుమతులు ఇప్పించినట్లు తెలిపాడు. ఇందుకు గాను ఆ సంస్థ లైజనింగ్‌‌ ఆఫీసర్‌‌‌‌ తనకు రూ.50 లక్షలు ఇచ్చాడని చెప్పాడు. కోకాపేట్ లోని ఒక హైరైజ్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌‌లో అవసరమైన సాయం చేసినందుకు గాను ఆ కంపెనీ జనరల్ మేనేజర్ 2022 డిసెంబర్‌‌‌‌లో రూ.40 లక్షలు ఇచ్చాడని పేర్కొన్నాడు. కోకాపేట్ లోనే మరో మల్టీస్టోర్డ్ హై రైజ్ బిల్డింగ్‌‌ విషయంలో సాయం చేసినందుకు గాను ఆ ప్రాజెక్టు వాళ్లు రూ.35లక్షలు ఇచ్చారని చెప్పాడు. ఇలా సేకరించిన లంచం డబ్బులను అరవింద్‌‌ కుమార్​కు ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చేవాడినని తెలిపాడు.

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌‌‌‌ కూడా అరవింద్‌‌ కుమార్‌‌‌‌, తనపై ప్రెజర్ చేసినట్లు శివబాలకృష్ణ చెప్పారు. యాచారం మండలం కొత్తపల్లిలో సోమేశ్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాల19 గుంటల భూమి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం కోసం కొద్ది మంది రైతుల నుంచి హెచ్‌‌ఎండీఏకు దరఖాస్తు వచ్చింది. ఆ ఫైల్ పెండింగ్‌‌లో ఉండడంతో దాన్ని క్లియర్​ చేయాలని అరవింద్‌‌ కుమార్‌‌‌‌కు, తనకు సోమేశ్ కుమార్‌‌‌‌ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఏసీబీ సోదాల్లో దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది.