ఉద్యమకారుడ్ని.. కేసులకు భయపడను

ఉద్యమకారుడ్ని.. కేసులకు భయపడను
  • అవమానం సహించలేకే రాజీనామా
  • ఎమ్మెల్సీ ఇస్తానని 2006 నుంచి హామీ ఇస్తున్నరు
  • సీఎం బర్త్​డే నాడూ మాటిచ్చి.. మోసం చేశారు

పెద్దపల్లి, వెలుగు:  నామినేషన్​ వేసినప్పటినుంచే తనను  భయపెట్టాలని చూస్తున్నారని, తాను ఉద్యమకారున్నని, ఎవరికీ భయపడనని కరీంనగర్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీ క్యాండిడేట్​ సర్దార్​ రవీందర్​ సింగ్​అన్నారు. పెద్దపల్లిలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎవరిచ్చినా డబ్బులు తీసుకుని తనకు ఓటేయాలన్న తన కామెంట్లపై కేసు పెట్టారని, గతంలో సీఎం కేసీఆర్​కూడా ఈ కామెంట్లు చేశారని గుర్తు చేశారు. అర్జునగుట్ట పుష్కరాలకు తన సతీమణితో వచ్చిన కేసీఆర్ 2006 లోనే తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, రెండోసారి కార్పొరేటర్​గా గెలిచినా మేయర్​గా కొనసాగించకుండా ఎమ్మెల్సీని చేస్తామని మరోసారి భరోసా ఇచ్చారని రవీందర్​ సింగ్​ వివరించారు. 

రెండు నెలల కింద జరిగిన సీఎం బర్త్​డే సందర్భంగా కలిసినప్పుడు కూడా తన హామీని గుర్తు చేశారని, తీరా ఎన్నికలొచ్చిన తర్వాత మాట తప్పారని రవీందర్ సింగ్ అన్నారు. క్యాండిడేట్ల లిస్టులో తన పేరే లేకపోవడం అవమానంగా భావించి పార్టీకి రాజీనామా చేశానన్నారు.  పెద్దపల్లి నుంచి 2014  ఎన్నికల్లో  కాంగ్రెస్​ క్యాండిడేట్​గా పోటీ చేసిన భానుప్రసాదరావు కేసీఆర్​ను నోటికొచ్చినట్లు తిట్టాడని, అసలు ఎల్. రమణ,  భానుప్రసాదరావు ఒక్కసారన్నా  జై తెలంగాణ అనలేదని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు గడించాడన్నారు. ఎంపీటీసీల కోసం ఆయన ఏనాడూ కృషి చేయలేదన్నారు. తాను పోటీలో ఉండడంపట్ల ఎంపీటీసీలందరూ సంతోషంగా ఉన్నారన్నారు.