
తిరువనంతపురం: కమ్యూనిస్ట్ కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. అచ్యుతానందన్ కేరళలోని అలప్పుజలో నిరుపేద కుటుంబంలో 1923 అక్టోబర్ 20న జన్మించారు. పేదరికంతో చిన్నతనంలోనే చదువు ఆపేసిన ఆయన టైలర్ షాపులో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పని చేస్తూ పొట్ట గడుపుకున్నారు. అనంతరం కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు.
1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా మారారు. స్వాతంత్ర్యానికి ముందున్న ట్రావెన్ కోర్ రాష్ట్రంలో భూస్వాములపై పోరాటం చేసి జైలు కెళ్లారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం స్థాయికి ఎదిగారు.
సీఎంగా ఒకసారి.. విపక్ష నేతగా మూడుసార్లు
సీపీఐ జాతీయ కౌన్సిల్ ను 1964లో వదిలేసి సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఒకసారి సీఎంగా, మూడు సార్లు విపక్ష నేతగా వ్యవహరించారు.