పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, వెలుగు: నేటి తరం పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం రాత్రి రంగధాంపల్లి, నర్సాపూర్, ప్రశాంత్‌నగర్‌లలో జరిగిన దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. భవిష్యత్‌తరాలకు మనం ఇచ్చే సంపద సంస్కృతి, సంప్రదాయాలే అన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. దసరా పండుగ.. పెద్దలపై ఉన్న గౌరవాన్ని గుర్తు చేయడమే కాకుండా.. చెడును తొలగించి మంచిని నేర్పుతుందని చెప్పారు. 

నర్సాపూర్‌ హన్మాన్‌ ఆలయం వద్ద జరిగే దసరా సంబరాల్లో హారతి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని వర్గాలు అయోమయంలో ఉన్నాయని, వ్యాపారాలు లేకపోవడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని, పాత రోజులు మళ్లీ రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అంతకుముందు ప్రశాంత్‌నగర్‌లోని హనుమాన్‌ ఆలయంలో శమీపూజలో, రంగథాంపల్లి హనుమాన్‌ ఆలయం వద్ద రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు.