వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..పాలనపై సీఎం దృష్టి పెట్టడం లేదు: మాజీ మంత్రి హరీశ్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..పాలనపై సీఎం దృష్టి పెట్టడం లేదు: మాజీ మంత్రి హరీశ్
  • హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన 

పద్మారావునగర్, వెలుగు: వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. భారీ వర్షాలతో హైదరాబాద్​లో  ముంపునకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు ప్రాంతాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​తో కలిసి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా 1,500 మంది బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. మాజీ మంత్రి తలసాని తన సొంతంగా పేద ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని హరీశ్​ రావు అన్నారు.

 ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. మున్సిపల్ శాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలన సౌలభ్యం విషయంలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంపై మాట్లాడుతూ.. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటని హరీశ్​రావు అన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 

గ్రామపంచాయతీ లకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో గుంతలనుపూడ్చకుండా.. ఫోర్త్​ సిటీ పేరుతో 6 లైన్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు 10 మందిని చేర్చుకున్నామని అంటున్నారని.. పార్టీ మారిన ఎమ్మెల్యే లు సీఎల్పీ  మీటింగ్ కు హాజరు అయిన సంగతిని గుర్తుచేశారు. సిటీలో చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం సీఎం కు లేదన్నారు.