కరీంనగర్: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలాయ్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంగురంగుల వీడియోలు చూపించి ప్రజల్ని మోసం చేస్తోందని హరీశ్ రావు అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆయన పేరును ఎగవేతల రేవంత్ రెడ్డి అని మార్చుకోవాలని, ఆయన సీఎం(చీఫ్ మినిస్టర్) కాదు, చీటింగ్ మ్యాన్(సీఎం) అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు అడిగితే రాక్షసుని లాగా రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డాడు.
Also Read :- న్యూయార్క్... పారిస్ సిటీలతో హైదరాబాద్ పోటీపడాలి
కేసీఆర్ తెచ్చిన జీవో-55 ను రద్దు చేసి, తెచ్చిన జీవో-29 వల్ల అభ్యర్థులకు అన్యాయం జరిగుతుందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి గన్ మెన్ లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలి. జీవో-29కు, జీవో-55 కు తేడా గమనించాలని హరీశ్ రావు కోరారు. జీవో 55 ప్రకారం వంద ఉద్యోగాలుంటే మొదటి 50 ఓపెన్ కాంపిటేషన్ ఉంటే.. మిగతా 50 రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేసేవారని హరీశ్ రావు అన్నారు. జీవో-29 ప్రకారం.. మొదటి 50లో కేవలం ఓసీలే ఉండాలని రూల్ పెట్టారు. దీంతో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండరాదట. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో రిజర్వుడు పిల్లలకు ఉద్యోగాలొస్తే.. అసలు కోటా నుంచి తగ్గిస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు. అందుకే జీవో-29 రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశమంతా రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడని ఆయన విమర్శించాడు.