పాలమూరు వలసల పాపం కాంగ్రెస్, టీడీపీదే : హరీశ్ రావు

పాలమూరు వలసల పాపం కాంగ్రెస్, టీడీపీదే : హరీశ్ రావు
  • రాజకీయ లబ్ధి పొందేందుకు రేవంత్  యత్నమని ఆరోపణ

సంగారెడ్డి, వెలుగు: చంద్రబాబు  పాపాలు, కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్  రావు అన్నారు. పాలమూరు వలసల పాపం కాంగ్రెస్, టీడీపీదే అని ఆయన విమర్శించారు. పాలమూరు వేదికగా సీఎం రేవంత్  రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గురువారం సంగారెడ్డిలో మీడియాతో హరీశ్  మాట్లాడారు. మహబూబ్ నగర్  వెనుకబాటుతనానికి అప్పటి టీడీపీ, కాంగ్రెస్  పాలనలే కారణమన్నారు. 

సీఎం రేవంత్  తిట్టాల్సి వస్తే  ముందుగా తన గురువు చంద్రబాబును తిట్టాలన్నారు. కాంగ్రెస్  చేసిన మోసాలను నిందించాలి తప్ప కేసీఆర్ ను కాదన్నారు. ప్రాజెక్టుల పేర్లు మార్చి పనులు పూర్తి చేయలేని  పార్టీలను అనాల్సింది పోయి పెండింగ్  ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన కేసీఆర్ ను తిట్టడం అవివేకమన్నారు. సీఎం మహబూబ్ నగర్  జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెస్  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో నీటి వాటా తేల్చాలని సవాల్  విసిరారు. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్  కాదా అని ప్రశ్నించారు. ‘‘పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి దివంగత సీఎం వైఎస్ఆర్  నీళ్లు తీసుకువెళ్తే రేవంత్  రెడ్డి నాడు ఎందుకు మాట్లాడలే? కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్  ప్రాజెక్టులను అప్పుడు కాంగ్రెస్  ఎందుకు పూర్తి చేయలే? 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ, మేము పదేండ్లలోనే రూ.2,600 కోట్లు ఖర్చుచేసి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. నెట్టెంపాడుకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ.540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం” అని హరీశ్  పేర్కొన్నారు.