జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా తరహాలో ఇక్కడా చర్యలు ఉండాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరా భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం.. జగిత్యాలలో కబ్జా అయిన రూ.100 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. సర్వే నంబర్ 138 కేసు 1964 నుంచి సాగుతోందని, యాజమాన్య హక్కుల కోసం ఇప్పటివరకు ఒక్క కోర్టులోనూ ఆక్రమణదారులు పోరాడలేదని చెప్పారు.
ఈ వివాదంలో మున్సిపల్ అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
విచారణ కమిటీపై ప్రభావం చూపేలా మాట్లాడటం సరికాదన్నారు. వ్యాపారవేత్త మంచాల కృష్ణ ఇంటికి తాను రాత్రిపూట వెళ్లలేదని, ఆర్యవైశ్య సంఘం మద్దతు కోసం మాత్రమే ఆయనను కలిశానని తెలిపారు. అంతకుముందు రెండుసార్లు ఆయనపై ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాయకులు బండ శంకర్, దుర్గయ్య, రాజేందర్, అశోక్ తదితరులున్నారు.
