
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో.. హైడ్రామా కొనసాగుతోంది. బీరం హర్షవర్దన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో ఇరు వర్గాలు ఆందోళనకు దిగారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసరగా.. డైరెక్టుగా ఇంటికే వస్తానని చెప్పారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. ఇద్దరు నేతల సవాళ్లతో ఇవాళ తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇద్దరు నేతల ఇళ్లకు చేరుకున్నారు. బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు.
నేతల ప్రకటనతో కొల్లాపూర్ లో టెన్షన్ కొనసాగుతోంది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బహిరంగ చర్చకు అనుమతించేది లేదని చెప్పారు. ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల దగ్గర భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్ల మీదకొస్తే కేసులు పెడతామని చెప్పారు పోలీసులు.
కొంత కాలంగా కొల్లాపూర్ TRSలో జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ స్వయంగా జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లడంతో అంతా సెట్ రైట్ అయ్యిందనుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి ఇద్దరు నేతలు బహిరంగ ఆరోపణలతో రచ్చకెక్కారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోసం ఇంట్లోనే వెయిటింగ్ చేస్తున్నానన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. 12గంటల వరకు ఇంట్లోనే ఉంటానన్నారు. ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలన్నారు.