- అర్ధరాత్రి 2.45గంటలకు తుదిశ్వాస
- మధ్యాహ్నం జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు మంగళవారం ఉదయం నిమ్స్ లో చికిత్య పొందుతూ మృతి చెందారు. పీసీసీ అధ్యక్షులుగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన సత్యనారాయణ రావ్ (88) అర్ధరాత్రి 2.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎం.ఎస్.ఆర్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానం స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
కాంగ్రెస్ నేతల దిగ్భ్రాంతి.. సంతాపం
కాంగ్రెస్ పార్టీ భీష్మాచార్యుడైన ఎం. సత్యనారాయణ రావ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ఆయన మరణ వార్త విన్న వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావంతుణ్ణి ప్రార్థించారు. ఎమ్.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్ కు తీరని లోటు అన్నారు..
సీఎం కేసీఆర్ సంతాపం
పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీ గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
