
- మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు గండి కొట్టి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా 50 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నాలు మానుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 36 లక్షల ఎకరాలు సాగు భూమి ఉండగా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడు మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయని, రెండు మోటార్లు కాలిపోయి ఐదేళ్లు దాటినా కొత్తవి బిగించలేదన్నారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా డిండి ప్రాజెక్ట్‌కు నీటిని తరలిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కుదించి డిండికి తరలిస్తే ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, తిమ్మాజీపేట పాండు, లక్ష్మయ్య, సత్యం, భీముడు, అహ్మద్, వెంకటేశ్, విష్ణు, సుధాకర్ రాజు తదితరులు
పాల్గొన్నారు.