కాంగ్రెస్​కు ఓటు వేసినందుకు .. జనం బాధపడుతున్రు : నిరంజన్​రెడ్డి

కాంగ్రెస్​కు ఓటు వేసినందుకు .. జనం బాధపడుతున్రు : నిరంజన్​రెడ్డి
  • ఉద్యోగులకు 77 శాతం ఫిట్​మెంట్​ఇచ్చినా తృప్తి కాలే

కోల్​బెల్ట్, వెలుగు: రెండు నెలల్లోనే కాంగ్రెస్​కు ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడే  పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైందని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్​విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్​పై దుష్ప్రచారం చేశారని, అబద్ధమే నిజమనేలా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేసిందని ఆరోపించారు. కారణం ఏదైనా పార్టీ శ్రేణుల్లో కొంత నిరాసక్తత వ్యక్తమైందన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 420 హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు అడగకుండానే అన్నిరకాల పథకాలు అందించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు.

కొత్తగా వచ్చిన ఓటర్లకు తెలంగాణ త్యాగాలు తెల్వదని, ఉద్యోగులకు 77 శాతం ఫిట్​మెట్​ఇచ్చినా సంతృప్తి పడలేదన్నారు. లక్షా అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినా, టీఎస్పీఎస్సీ చేసిన తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వంపై రుద్దారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, రాహుల్​గాంధీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్​రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, మాజీ మంత్రి బోడ జనార్దాన్​తదితరులు పాల్గొన్నారు.