
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వంద రోజుల్లో పీఆర్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, డీఏలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని మండిపడ్డారు. బుధవారం ఉద్యోగ సంఘాల మాజీ నేతలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఉద్యోగులపై సీఎం బెదిరింపు ధోరణి సరికాదని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఉద్యోగులను ఎవ్వరూ రెచ్చగొట్టడం లేదని, హామీలు నెరవేరనందుకే ఉద్యోగులు ఆందోళనలు చేస్తమని ప్రకటించారని అన్నారు. ఉద్యోగులు ప్రజలు వేర్వేరు కాదని స్వామి గౌడ్ అన్నారు. ఉద్యోగులను అవమానపరచడం సరికాదన్నారు.