కూలి నుంచి ఎమ్మెల్యే స్థాయికి..అయినా సొంతింటి కల తీరలే

కూలి నుంచి ఎమ్మెల్యే స్థాయికి..అయినా సొంతింటి కల తీరలే
  •     సొంతింటి కల తీరనేలేదు
  •     రాజకీయాల్లోకొచ్చి ఆస్తులమ్ముకున్నారు
  •     ఎమ్మెల్యే అయినా లైఫ్ స్టైల్ మారలేదు

సంగారెడ్డి/జహీరాబాద్కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే హోదా వరకు ఎదిగిన బాగన్న చివరి వరకు నిరాడంబరంగానే బతికారు. ఐదేండ్లు రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు సొంతింటి కల కూడా నెరవేరలేదు. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడితే జహీరాబాద్‌‌లో ఇంటి జాగ మంజూరైంది. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు సరిపోక ఇంటి నిర్మాణం పునాది దగ్గరే ఆగిపోయింది. చాలా కాలం చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయిన ఆయన అంత్యక్రియలు శనివారం జరిగాయి.  జహీరాబాద్ మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన బాగన్న 1977లో రాజకీయాల్లోకి రాకముందు కూలి పని చేస్తూ,  ఎడ్లబండి నడిపేవారు. 1977లో పంచాయతీ మెంబర్‌‌‌‌గా గెలిచిన బాగన్న 1981లో సర్పంచ్‌‌గా ఎన్నికయ్యారు. 1987లో టీడీపీ నుంచి పోటీ చేసి మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలిచారు. బాగన్న గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఆయనకు 1994లో జహీరాబాద్​అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్​కు ఎదురేలేని జహీరాబాద్‌‌లో టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల ఖర్చుల కోసం ఆయన జహీరాబాద్‌‌లో ఇంటిని, సొంత ఊళ్లో 2 ఎకరాల భూమిని అమ్ముకున్నారు. 2004లో  చంద్రబాబు టికెట్ ఇచ్చినా డబ్బులు లేక గెలవలేకపోయారు. ఆతర్వాత బీజేపీలో, అక్కడ నుంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరినా.. ఇప్పటి పాలిటిక్స్‌‌లో ఇమడలేక సైలెంట్‌‌గా ఉన్నారు. తనకంటూ ఓ ఇళ్లు ఉండాలనుకున్న బాగన్న చాలాకాలం పాటు ఆటోలు, బస్సుల్లో ఆఫీసుల చుట్టూ తిరగ్గా.. జహీరాబాద్ స్థలం కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్ స్కీం కింద రూ.5.50 లక్షలు కేటాయిస్తామని, అవి  సరిపోకపోతే మిగతా డబ్బులు తాను సొంతంగా ఇస్తానని మంత్రి హరీశ్‌‌రావు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఆయన ఇంటి నిర్మాణం బేస్​మెంట్ దగ్గరే ఆగిపోయింది. ప్రజలతో ఆత్మీయంగా ఉండే బాగన్న జహీరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి  కృషి చేశారు. బాగన్నకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదేళ్ల కింద ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి

జహీరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న అంత్యక్రియల్లో మంత్రి హరీశ్‌‌రావు పాల్గొన్నారు. శనివారం జహీరాబాద్‌‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఉంచిన బాగన్న పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాగన్న నిరాడంబర జీవితం గడపారని, బీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించే వారన్నారు. బాగన్న మృతి  తనను ఎంతగానో  కలిచివేసిందన్నారు. బాగన్నకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీ బి.బి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు వై.నరోత్తం, బీజేపీ నాయకుడు జంగం గోపి తదితరులు కూడా
నివాళులర్పించారు.