
మంచిర్యాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ టికెట్ ను అన్ని పార్టీలు బీసీలకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. రూ.5 కోట్లయినా ఖర్చుపెట్టి బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే అంతర్గాంలోని తన సొంత భూమి అమ్మి డబ్బులు సమకూరుస్తానన్నారు. శుక్రవారం మంచిర్యాల నియోజకవర్గ బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో ఎం కన్వెన్షన్ హాల్లో బీసీ లీడర్లు, టికెట్ ఆశావాహులతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు.
చీఫ్ గెస్ట్ గా హాజరైన గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ ఏ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా రాజకీయాలకు అతీతంగా వారి గెలుపునకు కృషి చేస్తానన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని సూచించారు. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, డాక్టర్లు పి.రమణ, బి.రఘునందన్, బీసీ లీడర్లు నీలి శ్రీనివాస్, ముత్తినేని రవికుమార్, కర్రే లచ్చన్న, దోమటి అర్జున్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు, ఉదారి చంద్రమోహన్ గౌడ్, నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి క్యాండిడేట్‌ను నిలిపి బీసీల సత్తా చాటుతామన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యం చెల్లదని హెచ్చరించారు.
5 శాతం ఉన్నోళ్లకు 40 సీట్లు.. 60 శాతం ఉన్నోళ్లకు 23 సీట్లా?
హనుమకొండ: రాష్ట్రంలో రెడ్లు, వెలమలే రాజ్యాధికారం చెలాయించాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అన్నారు. ఐదు శాతం ఉన్న రెడ్లకు 40 సీట్లు, అర శాతం ఉన్న వెలమలకు 11 సీట్లు ఇచ్చి, 60 శాతం ఉన్న బీసీలకు మాత్రం కేవలం 23 సీట్లు కేటాయిస్తరా అని ప్రశ్నించారు. ఈ నెల 10న హైదరాబాద్ సరూర్ నగర్గ్రౌండ్లో నిర్వహించనున్న బీసీ సింహగర్జన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్లో ఆవిష్కరించారు. బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బైరి రవికృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన సీట్లలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం బీసీల్లో ఉన్న 133 కులాల్లో కేవలం 5 కులాలకు మాత్రమే 23 సీట్లిచ్చి మిగితా 127 కులాలకు ఒక్క సీటు ఇవ్వకుండా మొండిచేయి చూపారన్నారు.
ఇప్పుడు ప్రకటించిన సీట్లను సవరించి బీసీలకు సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బీసీల జనాభా ప్రకారం సీట్లు ప్రకటించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ , రిటైర్డ్ ప్రొఫెసర్ డా. కూరపాటి వెంకటనారాయణ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి రాజమౌళి, పద్మశాలి సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డా. చందా మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు పల్లెపు సమ్మయ్య, గోపా నాయకులు డా. చిర్ర రాజు గౌడ్, వివిధ సంఘాల నాయకులు తంగళ్ళపల్లి రమేష్, తాళ్ల సంపత్ కుమార్, బచ్చు ఆనందం, అన్నారపు యాకయ్య, తమ్మేలా శోభ రాణి, సులోచన, తౌటం రవీందర్, దాడి రమేష్ యాదవ్, పంజాల మధు గౌడ్, తాళ్లపెల్లి రమేష్, రాసురి రాజశ్పాల్గొన్నారు.