- మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు
మెదక్ టౌన్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు ఏ ముఖం పెట్టుకొని మెదక్ వస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మెదక్ పట్టణంలోని 8, 9,10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి హరీశ్ రావు మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి అనేక ప్రభుత్వ కార్యాలయాలను సిద్దిపేటకు తరలించారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే రోహిత్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణం, నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కోవర్టులను ఏరివేసి గెలిచే అవకాశం ఉన్న వారికే కౌన్సిలర్ టికెట్లు ఇస్తున్నామని చెప్పారు. 10వ వార్డులో మాజీ కౌన్సిలర్లు, వారి అనుచరులతో హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, మధుసూదన్ రావు, దుర్గాప్రసాద్, బాలకృష్ణ, రాజేశ్, పవన్ పాల్గొన్నారు.
