గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి

హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆయన స్వస్థలం హుజూరాబాద్ మండలం జూపాక. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాయిరెడ్డి గతంలో ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1983, 1989లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 

సాయిరెడ్డి మృతి పట్ల మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సంతాపం ప్రకటించారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ సాయిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయిరెడ్డి మృతి తెలంగాణకు, కరీంనగర్ జిల్లాకు తీరని లోటని ఆయన అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌లు సాయిరెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సాయిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామమైన జూపాకలో రేపు నిర్వహించనున్నారు.