అసెంబ్లీలోకి మాజీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ...అడ్డుకుంటున్న సెక్యూరిటీ

అసెంబ్లీలోకి మాజీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ...అడ్డుకుంటున్న సెక్యూరిటీ
  •     ఏనాడూ ఇలా     జరగలేదంటున్న మాజీలు
  •     పార్లమెంట్ లో లేని నిబంధన ఇక్కడేందని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇన్నాళ్లూ దర్జాగా లోపలికి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ లో షాక్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ముందే ఓ సర్క్యులర్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం అసెంబ్లీ లోపలికి మాజీ ప్రజా ప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. 

దీంతో అసెంబ్లీ బయట భద్రతా ఏర్పాట్లు చూసే లా అండ్ ఆర్డర్ పోలీసులు.. అసెంబ్లీ లోపల భద్రతను పర్యవేక్షించే మార్షల్స్ మాజీలను లోపలకు అనుమతించడం లేదు. గతంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాజీలు లాబీ వద్దకు వచ్చి మంత్రులను, సీఎంను కూడా కలిసి తమ సమస్యలను చెప్పుకునేవారు. తమకు అందుతున్న వైద్య సేవలు, పెన్షన్ చెల్లింపులపై గోడు వెల్లబోసుకునేవారు. 

కానీ ప్రస్తుతం అసెంబ్లీ లాబీల వద్దకే కాదు.. ఆ ఆవరణలోని లెజిస్లేచర్ పార్టీ కార్యాలయాలున్న కారిడార్ వద్దకు వెళ్తామన్నా అనుమతించడం లేదని మాజీలు వాపోతున్నారు. ఎప్పట్లాగే సభ జరుగుతున్న టైంలో శాసనసభకు వచ్చే అలవాటున్న పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నాలుగైదు రోజులుగా అసెంబ్లీకి వస్తుండగా.. ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. లోపలున్న మంత్రులకు ఫోన్లు చేసినా వారి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వెనుదిరుగుతున్నారు.  

గురువారం సీపీఐ శాసన సభా పక్ష మాజీ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నేరుగా సీఎంవో అధికారులకు ఫోన్ చేయడంతో లోపలికి అనుమతించారు. పార్లమెంట్ లోనే మాజీ ఎంపీలను అనుమతి ఇస్తుండగా.. ఇక్కడ నిరాకరించడం ఏమిటని మాజీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి నిబంధనలు లేవని, ఇప్పుడే కొత్తగా ఎందుకని ప్రశ్నిస్తున్నారు.