ఖమ్మం: కృష్ణా జలాల వినియోగంపై ఆగస్టు 5వ తేదీన ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేయమని కోరడం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. 19వ తేదీ నాటికి పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని 20వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం వెనక సీఎం కు రహస్య ఎజెండా ఏమిటని పొంగులేటి ప్రశ్నించారు. ఒక పక్కన ఏపీ ప్రభుత్వం జల దోపిడీ చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చుక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టబోమని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న రహస్య ఎజెండాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే ఇంతకంటే ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి ఏం ఉందని ఆయన ప్రశ్నించారు.
దాడులు జరుగుతుంటే సీఎం నోరు మెదపరేం?
దళితులు ,అమాయకపు రైతులపై వరుసగా జరుగుతున్న ఘటనపై సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అకృత్యాలపై సిట్టింగ్ జడ్జి తో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా దళితుడి పై లారీ ఎక్కించి చంపించడాన్ని తీవ్రంగా ఖండించారు . జడ్చర్ల, గజ్వేల్,భూపాలపల్లి లో జరిగిన ఘటనలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. . దళితులకు కు మూడు ఎకరాలు భూమి ఇస్తామన్న ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వారి భూములు లాక్కోవటం అన్యాయమన్నారు . ఈ ఘటనపై తమ పార్టీ శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ వరుస దాడులు జరుగుతుంటే నోరు మెదపడం లేదని విమర్శించారు.

