హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ సారి గెలిచేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ అశోక్ తన్వర్ పేరు హర్యానా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయన పార్టీ మారిన విధానమే. బీజేపీ తరుఫున ప్రచారం చేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గంటల వ్యవధిలోనే కండువాలు మార్చిన అశోక్ తన్వర్ తీరు ఎన్నికల వేళ హర్యానాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా, కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన అశోక్ తన్వర్ ఎంపీగా, 2014 నుండి 2019 వరకు హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. ఏడాదిలోనే టీఎంసీకి రిజైన్ చేసి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఇండియా కూటమిలో జాయిన్ కావాలన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన్వర్ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్‌ని వీడారు. ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ALSO READ | హామీలను అమలు చేయదు... బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిరా నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ కుమారి సెల్జా చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక, ఇవాళ (అక్టోబర్ 3) ఉదయం వరకు అశోక్ తన్వర్ బీజేపీలోనే ఉన్నారు.. కాషాయ పార్టీకి మద్దతు ప్రచారం కూడా చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తరుఫున ప్రచారం చేసిన రెండు గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి సొంతగూటికీ చేరుకున్నారు అశోక్ తన్వర్. గంటల వ్యవధిలోనే కండువాలు మార్చిన తన్వర్ తీరు ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి అశోక్ తన్వర్ తీరే నిదర్శమని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.