ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తే సీఎం దిగొస్తరు: మాజీ ఎంపీ వివేక్​

ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తే సీఎం దిగొస్తరు: మాజీ ఎంపీ వివేక్​
  • కేసీఆర్​కు అబద్ధాలు చెప్పడం అలవాటైంది
  •  సెల్ఫ్​ డిస్మిస్​ అనడమంటే తుగ్లక్​ చేష్టలే
  • కార్మికులు ధైర్యంగా పోరాడాలె
  • హరీశ్, ఈటల బయటికొచ్చి మద్దతియ్యాలె

హైదరాబాద్‌‌, వెలుగు:

ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ఎదుట ధర్నాలు, ఆందోళలు చేయాలని.. అప్పుడైనా సీఎం కేసీఆర్‌‌  దిగొస్తారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. సీఎం వంద కోట్లతో ప్రగతిభవన్‌‌ కట్టుకుని రాజులా, నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బయట ప్రపంచంలో ఏ జరుగుతోందో కేసీఆర్​కు తెలియడం లేదని.. ఆయన పక్కన తెచ్చిపెట్టుకున్న పది మంది చెంచాగాళ్లు కార్మికులపై లేనిపోనివి చెప్తున్నారని విమర్శించారు. అలాంటి వారికే కేసీఆర్​ రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని.. వాళ్లు చాయ్‌‌, టీ, మందులు ఇవ్వడానికే పనికొస్తారని కామెంట్​చేశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని సీఎం ఉండటం వారి దురదృష్టమని పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘దళిత గిరిజన గర్జన సదస్సు’ జరిగింది. వివేక్‌‌ వెంకటస్వామి ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు, జనం ఎన్నో అవస్థలు పడుతున్నారని, మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్‌‌ బయటికొచ్చి తోడుగా నిలవాలని చెప్పారు. రాష్ట్రం వచ్చాక ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటుందని ఎంతో ఆశపడ్డామని, కానీ ఇలా నియంత పాలన అవుతుందని అనుకోలేదని విమర్శించారు. సెల్ఫ్‌‌ డిస్మిస్‌‌ అనే పదం ఏ చట్టంలోనూ లేదని, 49 వేల మంది సెల్ఫ్‌‌ డిస్మిస్  అంటున్నారంటే ఇంత కంటే తుగ్లక్‌‌  మరొకరు ఉండరన్నారు. కార్మికులంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక సిబ్బందిపై ఒత్తిడి తేవాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుందామని, తాము వెంట ఉంటామని భరోసా ఇచ్చారు.

అవసరానికి వాడుకుని వదిలేశారు

సీఎం కేసీఆర్‌‌కు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని వివేక్​ మండిపడ్డారు. కార్మికులను అవసరానికి ఉపయోగించుకుని రోడ్డున పడేయాలనే చూస్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో మంత్రి హరీశ్​రావు అందరినీ చైతన్యం చేశారని, కార్మికులు సైతం ఉద్యమానికి, టీఆర్‌‌ఎస్‌‌కు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. అప్పుడు కార్మికులను వాడుకున్నారని.. ఇప్పుడు చట్టబద్ధంగా నోటీస్‌‌ ఇచ్చినా కనీసం చర్చలకు పిలవడం లేదని మండిపడ్డారు. అసలు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 48 పెట్రోల్‌‌ బంకుల కోసం  సీఎం బంధువులకు ఆర్టీసీ ల్యాండ్‌‌ ఇచ్చుకున్నారన్నారు. ప్రభుత్వ జీవోలను ఆన్‌‌లైన్‌‌లో పెట్టడం లేదేమని నిలదీశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేస్తే సంస్థను బాగా నడిపించుకోవచ్చని.. సీఎం బాధ్యత తీసుకుని, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​చేశారు. ఆర్టీసీని గాడిన పడేసేందుకు కార్మికులు ఎంతో ప్రయత్నిస్తున్నారని, అయినా సీఎం కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు.

దోచిపెడుతున్నరు

బడ్జెట్‌‌  నిధుల్లో సగం కంటే ఎక్కువ ఆంధ్రా కాంట్రాక్టర్లకే మళ్లిస్తున్నారని వివేక్​ ఆరోపించారు. ఎలాంటి బిల్లుల వెరిఫికేషన్‌‌ లేకుండానే చెక్కులు ఇచ్చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మంచి పాలన చేసుకోవచ్చని, మన నిధులు మనం ఖర్చు చేసుకోవచ్చని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కానీ అంతా కేసీఆర్‌‌, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు తిరగబడితే పరిస్థితి వేరేలా ఉంటుందని గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్​ మెడలు వంచుదాం: అశ్వత్థామరెడ్డి

కార్మికులు సెల్ఫ్‌‌ డిస్మిస్‌‌ అయ్యారని ప్రకటించిన సీఎం కేసీఆర్​పై కేసు పెట్టాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కాదని, బతుకుదెరువు తెలంగాణ కావాలని చెప్పారు. కేసీఆర్‌‌ మెడలు వంచి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మహిళా కండక్టర్లకు దూరం డ్యూటీలు వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్మికులకు రూ.50 వేల మేర జీతాలు ఉన్నాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కో–-కన్వీనర్‌‌ రాజిరెడ్డి మండిపడ్డారు. అలా ఉన్నట్టు నిరూపిస్తే సమ్మె విత్‌‌డ్రా చేసుకుంటామని సవాలు చేశారు. ప్రగతిభవన్‌‌ కాదని, గడీల భవన్‌‌ అని, కార్మికులు మనోవేదనకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Former MP, BJP leader Vivek Venkata swamy fires on Cm KCR