బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​
  • ఉద్యమ ఆకాంక్షలను తుడిచేస్తున్నడు.. 
  • రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే:కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​
  • ఆహ్వానించిన కేంద్ర మంత్రులు భూపేంద్ర, కిషన్ రెడ్డి
  • సౌమ్యుడినే కానీ సైలెంట్​గా సర్జరీ చేస్తానని
  •  టీఆర్​ఎస్​ నేతలకు నర్సయ్య హెచ్చరిక
  • అమిత్​ షా, నడ్డా, సంతోష్​తో భేటీ 

 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అవినీతి, నియంతృత్వ పాలన సాగుతున్నదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​ మండిపడ్డారు. ‘‘ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందో, ఆ ఆకాంక్షలను కేసీఆర్ తుడిచేస్తున్నడు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైంలో ప్రకటించిన దళితబంధు టీవీలకే పరిమితమైంది. దళితులకు మూడెకరాల హామీ ఎటుపోయింది?” అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యపాలనకు కేసీఆర్​ సర్కార్​లో ఆస్కారంలో లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్​ ఘన విజయం సాధించారని,  ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్​రెడ్డి విజయం సాధిస్తారని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం బీజేపీకి తప్పక ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని తాము అజెండాగా పెట్టుకున్నట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  బీజేపీలో చేరారు. తొలుత భూపేంద్ర యాదవ్ పార్టీ సభ్యత్వ రసీదును అందించగా.. కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ స్టేట్ చీఫ్​ సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నేతలు వెదిరె శ్రీరాం, నూనె బాల్ రాజ్  పాల్గొన్నారు. భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో కీలకంగా పని చేసిన ఉద్యమకారుడు నర్సయ్య గౌడ్​ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.  ‘‘దూరదృష్టితో ప్రధాని మోడీ తీసుకువచ్చిన పథకాలు దేశంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. కానీ, ఈ పథకాలు హైదరాబాద్ లో ఒక  ఇంటి దగ్గర (ప్రగతి భవన్) ఆగిపోతున్నాయి. సంజయ్ చేపట్టిన యాత్రలో ఈ విషయం తేటతెల్లమైంది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని ఆయన అన్నారు. 

నన్ను గెలకొద్దు: నర్సయ్యగౌడ్​
టీఆర్ఎస్​లో ఆత్మగౌరవం లేదని, ముఖ్యమంత్రిని కలవాలంటే ఏదో ఒక పదవిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని నర్సయ్యగౌడ్​ మండిపడ్డారు. ‘‘టీఆర్ఎస్ లో ఉండాలంటే బానిసత్వంలో  లిట్మస్ టెస్ట్ పాస్ కావాలి. నాకు స్పైన్, బ్రెయిన్ రెండూ ఉన్నాయి. బానిసత్వం నా జీన్స్ లోనే లేదు.  నేను చాలా సౌమ్యుడిని. దయచేసి టీఆర్ఎస్  నేతలు నన్ను గెలకొద్దు. పద్మారావు గౌడ్, మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు  నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే సైలెంట్​గా సర్జరీ చేస్త” అని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి  సిల్క్ స్మిత లాగా రోడ్లపై చిందులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తన ఐదేండ్ల ఎంపీ హయాంలో భువనగిరి లోక్​సభ నియోజక వర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని ఆయన తెలిపారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే బీజేపీ నినాదం తనకు గాయత్రి మంత్రంతో సమానమని చెప్పారు. ఆ నినాదానికి ప్రభావితమై  బీజేపీలో చేరానని పేర్కొన్నారు. ‘‘ఇది అందరి తెలంగాణ- అభివృద్ధి తెలంగాణ. కొందరి తెలంగాణ ఎంతమాత్రం కాదు. సబ్ కా తెలంగాణ, స్వాస్త్ తెలంగాణ అనే నినాదంతో పని చేస్త. జీవితాంతం తెలంగాణ, దేశ ప్రగతి కోసం పని చేస్త. ఆ దిశలో పని చేసే అవకాశం కల్పిస్తున్న బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ప్రచారంలో బీజేపీ తరఫున తాను  పాల్గొంటానని చెప్పారు.

బీజేపీలో చేరింది వీరే...
నర్సయ్యగౌడ్​తో పాటు పీసీసీ సెక్రటరీ వెంకటేశ్​ ముదిరాజ్,  సుదగాని హరిశంకర్ (ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీచేసిన అభ్యర్థి), టీఆర్ఎస్ నేతలు జి. మురళీకృష్ణ గౌడ్ (వికారాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్),  షెపూరి రవీందర్, జగన్ ముదిరాజ్, నవీన్ గౌడ్, కూరెళ్ల రాజు, సతీష్ ముదిరాజ్, ఎండీ జావెద్, బుద్ధులు,  టీడీపీ నుంచి వడ్డెపల్లి రాజేశ్వర్ రావు, ఎల్. రవి ప్రకాశ్​ యాదవ్ ( మనోజ్), నరేశ్​ మల్కుడ్,  కాంగ్రెస్ నుంచి పటేల్ వెంకటేశ్, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అమరవేని నర్సాగౌడ్, ఇబ్రహీంపట్నం సీనియర్ నేత జి.సత్యనారాయణ బీజేపీలో చేరారు.

అమిత్​ షా, నడ్డా, బీఎల్​ సంతోష్​తో నర్సయ్య భేటీ
బీజేపీలో చేరికకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నర్సయ్య గౌడ్  భేటీ అయ్యారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో మునుగోడుతో పాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. మునుగోడులో అనుసరించాల్సిన వ్యూహాలపై నర్సయ్య గౌడ్​కు అమిత్​ షా దిశానిర్దేశం చేశారు. అనంతరం బీజేపీ హెడ్ ఆఫీసులో తరుణ్​చుగ్, సంజయ్​తో కలిసి నర్సయ్య పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ( సంస్థాగత) బి.ఎల్. సంతోష్ తో భేటీ అయ్యారు. సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నడ్డా పార్టీ కండువా కప్పారు.