
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. బూర నర్సయ్యగౌడ్ తో పాటు కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, టీడీపీ నేత రవిప్రకాశ్ యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వ చొరవతోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు పోతానని చెప్పారు. ‘అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ’ కోసం పనిచేస్తానని వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషిచేస్తానని తెలిపారు.
తెలంగాణలో కుటుంబ పాలన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు అవసరమని చెప్పారు. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు ,దళితులకు మూడెకరాల భూమి హామీలను ఇంత వరకు నెరవేరలేదన్నారు. తెలంగాణాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన ,అవినీతి పాలన, నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు.
రాజీనామా...పార్టీ ప్రస్థానంపై లేఖ..
ఈ నెల 15న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తావించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలను ఎదుర్కొన్నానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.