
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు రౌస్ అవెన్యూ కోర్టు జీవితఖైదు విధించింది. సజ్జన్ వయసు, అనారోగ్య కారణాల వల్ల అతనికి మరణశిక్ష విధించడం లేదని పేర్కొంది. ఆ అల్లర్లలో ఇద్దరు సిక్కుల హత్యలో సజ్జన్ హస్తం ఉందని కోర్టు నిర్ధారించింది. జీవితఖైదుతో పాటు అల్లర్లకు పాల్పడినందుకు రెండేళ్లు, మారణాయుధాలు చేతపట్టి హింసకు పాల్పడినందుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పు చెప్పారు.
‘‘జస్వంత్ సింగ్, ఆయన కొడుకు తరుణ్‌దీప్ సింగ్‌ను చంపాలంటూ 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ఏరియాలో సజ్జన్ ఒక అల్లరిమూకను రెచ్చగొట్టాడు. అతని నేతృత్వంలోని మూక ఆయుధాలు చేతపట్టి హింసకు పాల్పడింది. సిక్కుల ఇండ్లు, షాపులను లూటీ చేయడం, ధ్వంసం చేయడం వంటివి చేసింది. సజ్జన్ కుమార్ చేసిన నేరాలు కచ్చితంగా దారుణమైనవే. అయితే, ప్రస్తుతం అతని వయసు 80 ఏండ్లు. అంతేకాకుండా అతడికి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.
అలాగే.. ఈ కేసులో సజ్జన్ ఇదివరకే జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో అతనికి జీవితఖైదు విధిస్తున్నాం” అని జడ్జి తెలిపారు. ఈ కేసులో ఇదివరకే సజ్జన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, సజ్జన్‌కు మరణశిక్ష విధించాలని అంతకుముందు ప్రాసిక్యూషన్ వాదించింది. ‘‘సిక్కుల ఊచకోత కేసు నిర్భయ కేసు కన్నా మరింత సీరియస్ కేసు.
సజ్జన్ చేసిన నేరం అత్యంత అరుదైన జాబితాలోకి వస్తుంది. ఒక కమ్యూనిటీ వారిని లక్ష్యంగా చేసుకుని సజ్జన్ మారణహోమానికి పాల్పడ్డాడు. అతనికి మరణశిక్ష విధించాలి” అని ప్రాసిక్యూషన్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా.. సజ్జన్‌కు జీవితఖైదు విధించడంపై సిక్కు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడికి జీవితఖైదు సరిపోదని,
మరణశిక్ష విధించాల్సిందే అని డిమాండ్ చేశారు.
===================================