టైం వచ్చినప్పుడు టీఆర్ఎస్‌‌కు, కేసీఆర్‌‌‌‌కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి

టైం వచ్చినప్పుడు టీఆర్ఎస్‌‌కు, కేసీఆర్‌‌‌‌కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో వివేక్‌‌ మీడియాతో మాట్లాడారు. 2004లో అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆ టైమ్‌‌లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తులో కీలక పాత్ర పోషించింది ఆయనేనని గుర్తుచేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బతికి ఉందంటే డి.శ్రీనివాస్, వెంకటస్వామి (కాకా) కారణమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని, ఉద్యమాన్ని అప్పటి సీఎం వైఎస్‌‌ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారని, అయినా డి. శ్రీనివాస్, కాకా కేసీఆర్‌‌‌‌కు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యమంలో డి.శ్రీనివాస్, కాకా కీలకంగా వ్యవహరించారని తెలిపారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ వ్యతిరేకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వివేక్‌‌ అన్నారు. ఇప్పుడు అర్వింద్‌‌ ఇంటిపై దాడి చేసింది కూడా తెలంగాణ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. పోలీసుల సాయంతో టీఆర్ఎస్ గూండాలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారని, సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్‌‌కు, కేసీఆర్‌‌‌‌కు గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు.